దేశంలో కొవిడ్-19 వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. వరుసగా 8వ రోజూ 50వేలకు దిగువన కొత్త కేసులు నమోదవడమే ఇందుకు నిదర్శనం. నవంబర్ 7 కంటే ముందు రోజూ 50వేలకుపైగా వైరస్ కేసులు నమోదయ్యేవని వెల్లడించింది కేంద్ర ఆరోగ్య శాఖ.
మరోవైపు అమెరికా సహా.. ఐరోపా దేశాల్లో మాత్రం వైరస్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి.
క్రమంగా పెరుగుతున్న రికవరీలు
దేశవ్యాప్తంగా శుక్రవారం నాటికి కరోనా కేసుల సంఖ్య 88లక్షల 14వేల 579కి చేరగా.. 1లక్షా 29వేల 635 మరణాలు సంభవించాయని ఆరోగ్య శాఖ తెలిపింది. 82లక్షల మందికిపైగా వైరస్ను జయించారు. మరో 4.79 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం కేసులతో పోలిస్తే.. యాక్టివ్ కేసులు కేవలం 5.44 శాతమే కావడం శుభపరిణామం.
వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పోలిస్తే 10లక్షలకు కేవలం 6,387 కొవిడ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ పేర్కొంది. 21 రాష్ట్రాలు, యూటీల్లో దేశ సగటుకంటే తక్కువ మరణాలు నమోదవుతున్నట్టు చెప్పింది. అదే సమయంలో రోజూవారి కేసుల్లో కొత్త కేసుల కంటే రికవరీలే అధికంగా ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్త రికవరీ రేటు 93.09 శాతానికి పెరగ్గా.. మరణాల రేటు 1.47 శాతంగా నమోదైనట్టు ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఇదీ చదవండి: ఆ కుటుంబాల్లో విషాదం మిగిల్చిన 'దీపావళి'