దేశంలో రోజురోజుకీ రికార్డు స్థాయిలో నమోదవుతున్న కరోనా కొత్త కేసులు కలవరపరుస్తున్నా.. అదే స్థాయిలో కొవిడ్ బాధితులు కోలుకుని ఇళ్లకు చేరుతుండడం ఊరటనిస్తోంది. ప్రపంచంలో ప్రస్తుతం అత్యధిక మంది కోలుకున్న దేశాల జాబితాలో భారత్ తొలి స్థానంలో ఉంది. భారత్‌లో శనివారం ఉదయం నాటికి 42 లక్షల మందికి పైగా వైరస్ నుంచి కోలుకున్నారు. ఒక్క శుక్రవారమే 95 వేలకు పైగా డిశ్చార్జి అయ్యారు. రికవరీల్లో భారత్.. అమెరికాను దాటేసిందని శనివారం కేంద్ర ఆరోగ్యం శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 79.28 శాతానికి చేరగా.. మరణాల రేటు 1.61శాతంగా ఉంది.
సరైన సమయంలో పటిష్ఠ చర్యలు తీసుకోవడం వల్లే కొవిడ్ బారి నుంచి బాధితులు త్వరగా కోలుకుంటున్నారని కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ ప్రకటించింది. భారీ ఎత్తున నిర్ధారణ పరీక్షలు చేయడం, వారికి సరైన సమయంలో ప్రామాణికమైన చికిత్స అందజేయడం వంటి చర్యలు బాధితుల్ని మహమ్మారి నుంచి బయటపడేయడానికి దోహదం చేస్తున్నాయని వివరించింది.
భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) లెక్కల ప్రకారం.. శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా 6,24,54,254 నమూనాల్ని పరీక్షించారు. దాంట్లో నిన్న ఒక్కరోజే 8,81,911 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇక ఈరోజు ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో 93,337 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 53,08,015 కేసులు నిర్ధారణ అయ్యాయి. వీరిలో ఇప్పటికే 42 లక్షల మంది కోలుకోగా.. మరో 10లక్షల 13వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 1,247 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 85,619కి పెరిగింది.
ఇక అమెరికాలో ఇప్పటి వరకు 67,23,933 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. వీరిలో 36,89,081 మంది కోలుకుని ఇళ్లకు చేరారు. మరో 1,98,570 మంది మృత్యువాతపడ్డారు.