భారత్‌లో నరేంద్రమోదీ ప్రభుత్వానికి ప్రస్తుతం బలమైన ప్రతిపక్షం అవసరమని అభిప్రాయపడ్డారు ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ. అప్పుడే ప్రభుత్వ తప్పులను సమర్థంగా ఎత్తిచూపగలదని వెల్లడించారు. ప్రజాస్వామ్యదేశానికి సమతూకంతో కూడిన అధికార, ప్రతిపక్షాలు ఉండటం.. మనిషికి గుండెలాగా అత్యంత ఆవశ్యకమని వివరించారు. జైపుర్ లిటరేచర్ ఫెస్టివల్(జేఎల్ఎఫ్) కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అధికారవాదానికి, ఆర్థిక విజయాలకు మధ్య ఎటువంటి సంబంధం లేదని తెలిపారు.
వారికి ఆవులో, మేకలో ఇచ్చి చూడండి
పేదలకు సొమ్ము ఇస్తే వృథా అవుతుందని, వారు సోమరుపోతులవుతారన్న వాదనలను ఖండించారు అభిజిత్.
"పేదలకు ఆవులో, మేకలో ఇచ్చి చూడండి. పదేళ్ల తర్వాత వారు మరింత ఆనందంగా కనిపిస్తారు. ఎలాంటి ఆస్తులు లేనివారికంటే మరింతగా కష్టపడతారు. ఇది నిజమని భారత్, బంగ్లాదేశ్‌ల్లో పరిశోధించి నిరూపించాం. పేదరిక నిర్మూలనకు ఒక మార్గమంటూ లేదు. కొందరు ఆస్తి లేని పేదలు, ఇంకొందరు చదువులు లేని పేదలు. కేవలం ఒక చర్యతో వీటన్నింటినీ పరిష్కరించలేము."
-అభిజిత్ బెనర్జీ, నోబెల్ గ్రహీత
ప్రపంచ పేదరిక నిర్మూలనకు వినూత్న ప్రయోగాలు చేపట్టినందుకుగానూ ప్రవాస భారతీయులైన ఎమ్ఐటీ ఆర్థిక వేత్త అభిజిత్, అతని భార్య ఎస్తేర్ డుఫ్లో సహా హార్వర్డ్ ప్రొఫెసర్ మైఖేల్ క్రెమెర్‌లకు సంయుక్తంగా 2019 నోబెల్ ఎకనామిక్స్ బహుమతి లభించింది.