ఉత్తరాఖండ్‌లోని అనేక ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు.. ఇళ్లపై కొన్ని అంగుళాల మేర పేరుకుపోయింది. ఉదయం 11 వరకు హిమపాతం తగ్గకపోవడం వల్ల ప్రజలు బయటకి రాలేకపోతున్నారు. ఉదయం 11 గంటలకు కూడా ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇళ్ల ముందు నిలిపి ఉంచి వాహనాలు మంచులో కూరుకుపోతున్నాయి. అయితే మంగళవారం కూడా ఉత్తరాఖండ్‌లోని అనేక ప్రాంతాల్లో భారీగా మంచు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది.
జమ్ములోనూ అదే పరిస్థితి..
భారీగా కురుస్తోన్న మంచు కారణంగా శ్రీనగర్-ఉదంపుర్ మధ్య రాకపోకలు స్తంభించాయి. జమ్ము-శ్రీనగర్ హైవేని అధికారులు మూసివేశారు. దీంతో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. శ్రీనగర్ కురిసిన భారీ హిమపాతంతో రోడ్లు అన్నీ మంచు దిబ్బలును తలపిస్తున్నాయి. అధికారులు రహదారులపై పేరుకుపోయిన మంచును తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రయాణాలు బంద్..
హిమాచల్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మంచు గడ్డలు గడ్డలుగా కూరుస్తోంది. దీంతో కిన్నౌర్ నుంచి కాజా వరకు ఉండే పర్వత ప్రాంతంలో మంచు దిబ్బలు ఏర్పడం వల్ల అధికారులు రాకపోకలను ఆపేశారు. రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
దిల్లీలో పడిపోయిన ఉష్ణోగ్రతలు..
దిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. నేడు కనిష్ఠంగా 4 నుంచి 6 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో రాజధానిలో దట్టమైన పొగమంచు అలముకుంది.