జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక థియేటర్ కమాండ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు త్రివిధ దళాల ప్రధానాధికారి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ప్రారంభంలో 'ఎయిర్ డిఫెన్స్ కమాండ్'ను, 2021 చివరి నాటికి 'పెనిన్సులా కమాండ్'ను రూపొందించనున్నట్లు వెల్లడించారు.
114 యుద్ధవిమానాలతో పాటు భారీ రక్షణ ఆయుధాల కొనుగోలు విధానానికి మద్దతు తెలిపారు రావత్. భారత రక్షణ వ్యూహరచనల కోసం విదేశీ స్థావరాలను కూడా పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేశారు.
"ఎయిర్ డిఫెన్స్‌కు భారత వైమానిక దళం నాయకత్వం వహిస్తుంది. సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణులు, ఇతర ఆయుధాలు దీని అధీనంలోనే ఉంటాయి. తూర్పు, పశ్చిమ భారత నౌకాదళాలను పెనిన్సులా కమాండ్‌కు అనుసంధానిస్తాం. శిక్షణ, సిద్ధాంత, వ్యూహరచనకు వేర్వేరు కమాండ్లను కూడా ఏర్పాటు చేస్తాం. దేశీయంగా నిర్మించిన విమాన వాహక నౌక పనితీరును అంచనా వేసిన తరువాతే.. నావికాదళం ప్రతిపాదించిన మూడవ విమాన వాహక నౌక డిమాండ్‌ను పరిగణిస్తాం. నౌకాదళంలో వాహకనౌకల కంటే జలాంతర్గాములకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం."
- జనరల్ బిపిన్ రావత్, సీడీఎస్