బ్యూరోక్రటిక్ తరహా పాలనకు స్వస్తి పలికి.. నవభారతం దిశగా భారత్ అడుగులు వేస్తోందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆర్థిక పరమైన సంస్కరణలు చేపడుతున్న కారణంగా భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు. భారత పన్నుల విభాగంలో సమూల మార్పుల చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం భారత్ వాణిజ్య పెట్టుబడులకు అనుకూలంగా ఉందని.. అందుకు ఇదే సరైన సమయమని ప్రకటించారు.
థాయిలాండ్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ.. బ్యాంకాక్‌లో జరిగిన ఆదిత్య బిర్లా గ్రూప్ స్వర్ణోత్సవాల్లో పాల్గొన్నారు. బ్యూరోక్రటిక్ పద్ధతిలో పాలన సాగించే విధానానికి స్వస్తి పలికి.. పాలనలో సంస్కరణలు తీసుకువచ్చామని ఉద్ఘాటించారు.
"భారత్ ఇప్పుడు 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న కలను సాకారం చేసుకునే దిశగా అడుగులేస్తోంది. 2014లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు.. దేశ జీడీపీ సుమారు 2 ట్రిలియన్ డాలర్లు. 65 ఏళ్లలో రెండు ట్రిలియన్ డాలర్లే.. కానీ, కేవలం అయిదేళ్లలోనే దేశ జీడీపీని సుమారు 3 ట్రిలియన్ డాలర్లకు పెంచాము. అయిదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించాలన్న భారత కల.. తొందరలోనే నిజమవుతుందని ఈ గణాంకాలు రుజువు చేస్తున్నాయి."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
ప్రస్తుతం భారత్‌లో పన్నులు చెల్లించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు ప్రధాని. ప్రజాహిత పన్ను విధానం కలిగిన దేశంగా భారత్ నిలిచినందుకు సంతోషంగా ఉందన్నారు. పన్నుల విధానంలో మరిన్ని సంస్కరణలు చేపడతమాని స్పష్టం చేశారు. ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ నిలిచిందని.. గత ఐదేళ్లలో 286 బిలియన్ అమెరికా డాలర్ల విదేశీ పెట్టుబడులు భారత్‌కు వచ్చాయన్నారు మోదీ.
ఇదీ చూడండి: నూతన భారతావని: జమ్ము-కశ్మీర్ యూటీలో పీఓకే