తమతో సంప్రదింపులు జరిపేందుకు భారత్ ప్రయత్నిస్తోందన్న పాకిస్థాన్ ప్రధానికి జాతీయ భద్రతా సలహాదారు మోయిద్ యూసఫ్ వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ ఖండించింది. యూసఫ్ మాటల్లో నిజం లేదని తేల్చిచెప్పింది.
"ఆయన(యూసఫ్) వ్యాఖ్యల్లో నిజం లేదు. చర్చల కోసం పాకిస్థాన్‌కు భారత్ ఎలాంటి సందేశాలు పంపలేదు."
--- అనురాగ్ శ్రీవాస్తవ, విదేశాంగ శాఖ ప్రతినిధి.
ఓ వార్తాసంస్థకు ఇటీవలే ఇంటర్వ్యూ ఇచ్చారు మోయిద్ యూసఫ్. పాక్‌తో చర్చలు జరిపేందుకు భారత సందేశాలు పంపుతోందన్నారు. ఈ ఇంటర్వ్యూలో.. కశ్మీర్ అంశాన్ని కూడా లేవనెత్తారు యూసఫ్.
ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించిన అనురాగ్ శ్రీవాస్తవ.. సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పాక్ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తోందని మండిపడ్డారు.
"ఇంటర్వ్యూకు సంబంధించిన వార్తను మేము చూశాం. భారత అంతర్గత వ్యవహారాలపై యూసఫ్ మాట్లాడారు. సొంత వైఫల్యాలను కప్పిపుచుకునేందుకే పాక్ ఇలాంటి మాటలు మాట్లాడుతోంది. తమ దేశ ప్రజలను తప్పుదారి పట్టించేందుకే భారత్ పేరును ప్రతిరోజు ప్రస్తావిస్తోంది."
--- అనురాగ్ శ్రీవాస్తవ, భారత విదేశాంగ శాఖ ప్రతినిధి.
'చైనాకు ఆ హక్కు లేదు'
తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు చైనాకు లేదని తేల్చిచెప్పారు శ్రీవాస్తవ. జమ్ముకశ్మీర్, లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్లు తమ దేశ భూభాగంలోనివేనని పునరుద్ఘాటించారు. సరిహద్దు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:- యుద్ధానికి సన్నద్ధం కండి-సైనిక దళాలకు జిన్‌పింగ్ పిలుపు!