కరోనా విజృంభణ నేపథ్యంలో సరిహద్దులను భారత్ మూసివేసింది. దీంతో చాలా మంది విదేశీయులు దేశంలోనే చిక్కుకుపోయారు. ఈ క్రమంలో భారత్లో ఉన్న తమ 180 మంది పౌరులను స్వదేశానికి వెళ్లడానికి అనుమతినివ్వాలని పాకిస్థాన్ హై కిమిషన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనికి స్పందించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ.. పాక్ పౌరులను స్వదేశానికి పంపడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
"ప్రస్తుతం భారత్లో ఉన్న 180 మంది పాక్ పౌరులను స్వదేశానికి పంపాలని పాకిస్థాన్ హైకమిషన్ చేసిన అభ్యర్థనను అర్థం చేసుకున్నాం. వారిని పాక్కు పంపడానికి సంబంధిత అధికారులతో సంప్రదింపులు చేస్తున్నాం."
-భారత విదేశాంగ శాఖ ప్రతినిధి
180 మంది పాక్ పౌరులను గురువారం ఉదయం 10 గంటలకు అటారీ- వాఘా సరిహద్దు నుంచి పంపించనున్నట్లు అధికారులు వెల్లడించారు. గత నెలలో కూడా ఐదుగురు పాకిస్థానీయులు సురక్షితంగా వారి దేశానికి చేరుకున్నట్లు తెలిపారు. ఎక్కువ మంది పాకిస్థానీయులు మెడికల్ వీసా మీద భారత్కు వస్తుంటారు.
అలాగే ఇతర దేశస్థులను కూడా వారి వారి దేశాలకు పంపటానికి అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.