నవంబరులో ప్రారంభం కానున్న కర్తార్‌పుర్ నడవాకు సంబంధించి పాకిస్థాన్‌తో ఈ నెల 23న ఒప్పందం కుదుర్చుకుంటామని భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. సేవా రుసుము కింద.. గరుద్వారాను సందర్శించే భక్తుల నుంచి 20 డాలర్లు వసూలు చేయాలన్న పాక్ ఆలోచనపై అసంతృప్తి వ్యక్తం చేసింది. నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని పాకిస్థాన్‌కు సూచించింది భారత్.
కర్తార్‌పుర్ సందర్శనకు వీసా అవసరం లేకుండా చూడడం సహా నవంబర్ 12న జరిగే గురునానక్ దేవ్ 550వ జయంతిలోగా నడవా ప్రారంభాన్ని దృష్టిలో ఉంచుకుని పాక్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది.
ఏటా 258 కోట్లు..
దర్బార్ సాహిబ్‌ను దర్శించుకునేవారిపై 20 డాలర్ల రుసుము విధించటం ద్వారా ఏటా రూ. 258 కోట్లు అర్జించాలని పాక్ భావిస్తోంది. ఈ విలువ పాక్ కరెన్సీలో రూ. 571 కోట్లు. ఈ ఛార్జీల ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూర్చుకోవాలని నిర్ణయించుకుంది పొరుగుదేశం.
రోజుకు 5 వేల మంది గురుద్వారాను సందర్శించేందుకు అనుమతించనుంది పాక్. ఒక్కొక్కరి నుంచి 20 డాలర్లు(రూ.1,400)చొప్పున రోజులో లక్ష డాలర్లు ఆదాయం పొందుతుంది.
ఇదీ చూడండి: హరియాణా: రాజకీయ కురుక్షేత్రాన ప్రశాంతంగా పోలింగ్