పదే పదే పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడవటంపై భారత్ నిరసన వ్యక్తం చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదుల చొరబాటుకు పాక్ సైన్యం మద్దతు ఇవ్వటంపై తీవ్ర అభ్యంతరం తెలిపినట్లు అధికారులు వెల్లడించారు.
భారత్-పాకిస్థాన్ 2003లో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోగా.. ఈ ఏడాది జూన్ వరకు దాయాది దేశం 2,432 సార్లు ఉల్లంఘించిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనల్లో 14 మంది భారతీయులు మరణించగా.. 88 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. ఎన్ని సార్లు చెప్పినా.. పాక్ మాత్రం దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉందని తెలిపారు.
"నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్థాన్ దళాలు నిరంతరాయంగా కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడటంపై మా నిరసనను వ్యక్తం చేస్తున్నాం"
- అధికారుల ప్రకటన.