దేశంలో కరోనాతో రెండో మరణం నమోదు కాగా.. ఈ వైరస్ బారినపడ్డవారి సంఖ్య 82కు చేరింది. ఈ నేపథ్యంలో కొవిడ్-19ను నిలువరించే దిశగా యావత్ భారతావని క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని రాష్ట్రాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలకు ఉపక్రమించాయి. జనం ఎక్కువగా గుమిగూడేందుకు అవకాశముండే సినిమా హాళ్లు, షాపింగ్ మాళ్లపైనా ఆంక్షలు విధించాయి. ఒడిశా, బిహార్ , ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, హరియాణాలు విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించాయి.
విద్యార్థులు ఈనెల 15లోగా తమ ఇళ్లకు వెళ్లిపోవాలని ఐఐటీ-దిల్లీ కోరింది. ఈ నెలాఖరు వరకూ తరగతులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఐఐటీ-కాన్పుర్, దిల్లీ జేఎన్‌యూ, జామియామిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం ఈనెల 31 వరకు తరగతులను రద్దు చేశాయి. భారత సైన్యం నెల రోజులపాటు నియామకాలను వాయిదా వేసింది. వైరస్ భయంతో ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. టికెట్ల రద్దు, రీషెడ్యూల్‌కు రుసుములను వసూలు చేయొద్దని అంతర్జాతీయ విమానయాన సంస్థలను పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ కోరింది. ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, శ్రీలంకలకు ఏప్రిల్ 30 వరకు విమానసేవలను ఎయిరిండియా రద్దు చేసింది.
జూన్ 30 వరకు..
ఆస్పత్రులపై భారాన్ని తగ్గించేందుకు, కేంద్ర ప్రభుత్వ అధికారులు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన ఆరోగ్య పరీక్షలను జూన్ 30 వరకు సస్పెండ్ చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
అంతర్జాతీయ మార్గాలు...
వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా అంతర్జాతీయ సరిహద్దుల్లోని 37మార్గాల్లో 18 మూసివేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇండో-బంగ్లాదేశ్ మధ్య రైలు, బస్సు సర్వీసులను వచ్చేనెల 15వరకూ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకూ మాల్దీవులు, అమెరికా, మడగాస్కర్, చైనా, ఇరాన్ నుంచి వెయ్యికిపైగా భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చినట్లు విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి.
ఇదీ చూడండి: కరోనా ముప్పుతో స్వీయ నిర్బంధంలోకి ప్రధాని