తూర్పు లద్దాఖ్ సరిహద్దులో భారత్-చైనా బలగాలు వెనక్కి వెళ్లిన నేపథ్యంలో శుక్రవారం మరోసారి చర్చలు జరపనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. వర్చువల్ భేటీలో ఇరు దేశాల అధికారులు సమావేశమవుతారు. సరిహద్దులో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ఇంకా చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తారు.
ఈ భేటీకి ముందు తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయ తమదన్న చైనా వాదనను భారత్ మరోసారి ఖండించింది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతల తగ్గించేందుకు దౌత్య చర్చలు జరగనున్న నేపథ్యంలో ఈ విషయాన్ని పునరుద్ఘాటించింది.
సరిహద్దుల్లో శాంతి, సామరస్యం ఆవశ్యకతను భారత్ గుర్తిస్తుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు. సమస్యలను దౌత్య మార్గంలోనే పరిష్కరించుకునేందుకు సిద్ధమన్నారు. అదే సమయంలో భారత సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు కట్టుబడి ఉంటామని తేల్చిచెప్పారు.
"గత శనివారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సంభాషణలో ఎన్ఎస్ఏ అజిత్ డోభాల్.. గల్వాన్ లోయతో సహా సరిహద్దుల్లో భారత వైఖరిని స్పష్టంగా తెలియజేశారు. సరిహద్దు నిర్వహణలో భారత బలగాలు బాధ్యతయుతంగా ప్రవర్తిస్తాయని చైనాకు స్పష్టం చేశారు. సరిహద్దుల్లో సహకారం, సంప్రదింపుల యంత్రాంగానికి సంబంధించి విధివిధానాలపై శుక్రవారం మరోసారి రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతాయి."
- అనురాగ్ శ్రీవాస్తవ
పరిస్థితులు మెరుగవుతున్నాయి..
భారత్-చైనా సరిహద్దుల్లోని పశ్చిమ ప్రాంతంలో పరిస్థితులు మెరుగవుతున్నాయని చైనా తెలిపింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ గురువారం ఒక ప్రకటన చేశారు.
"కమాండర్ స్థాయి అధికారుల మధ్య జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం మేరకు గల్వాన్‌తో పాటు, ఇతర ప్రాంతాల నుంచి భారత్-చైనా తమ బలగాల ఉపసంహరణకు సమర్థమైన చర్యలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం సరిహద్దు వెంట పరిస్థితులు స్థిరంగా, మెరుగ్గా ఉన్నాయి. త్వరలోనే డబ్ల్యూఎంసీసీ సమావేశం నిర్వహించి సైనిక, దౌత్య మార్గాల ద్వారా చర్చలు కొనసాగిస్తాం."
- ఝావో లిజియాన్
అయితే చైనా బలగాల ఉపసంహరణకు సంబంధించి ఎలాంటి వివరాలను లిజియాన్ వెల్లడించలేదు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్ తమతో కలసి పనిచేస్తుందని, ఏకాభిప్రాయాన్ని అమలుచేసేందుకు కృషి చేస్తుందని చైనా ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
నెలరోజులుగా వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ఇరు దేశాల సైనికుల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య జరిగిన అంగీకారం మేరకు తమ సైనిక బలగాలను ఉపసంహరించకున్నాయి.
ఇదీ చూడండి: 'సైనిక ఉపసంహరణే... ఉద్రిక్తతలకు ముగింపు కాదు'