అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో ఉన్నవన్నీ అసత్యాలేనన్నారు కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్. ఆరోపణలన్నీ హస్యాస్పదంగా , ఆధార రహితంగా ఉన్నాయని చెప్పారు. ప్రధాని మోదీ చేతిలో ఈడీ కీలుబొమ్మలా మారిందంటూ ఆరోపణలు చేశారు. ఎన్నికల వేళ అబద్ధాల వర్షం కురుస్తోందని ఎద్దేవా చేశారు.
న్యాయవ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. దొంగలకు అందరూ దొంగల్లానే కనబడుతారనే సామెత ఉంది కదా. మాపై వచ్చిన ఆరోపణలు నిరూపితమైతే చర్యలు తీసుకోండి. ఎన్నికల సందర్భంగా అబద్ధాల వర్షం కురుస్తోంది. మాట్లాడటానికి అంశాలు కావాలి కదా....! అందుకే దీన్ని పెద్దది చేస్తున్నారు - అహ్మద్ పటేల్, కాంగ్రెస్ నేత.
అగస్టా వెస్ట్‌ల్యాండ్‌కు సంబంధించిన బడ్జెట్లో పొందుపరిచిన 'ఏపీ' అనే అక్షరాలు అహ్మద్ పటేల్ అని ఈ కేసులో అరెస్టైన మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్ గుర్తించినట్లు ఈడీ ఛార్జ్‌షీట్‌లో తెలిపింది. రాజకీయ నాయకులు, ఇతరులకు సంబంధించి చేసిన చెల్లింపులు ఈ బడ్జెట్లో ఉన్నాయి. అయితే మిషెల్ చెప్పిన అహ్మద్ పటేల్‌పై పూర్తి స్పష్టత లేదు.
చిల్లర ఎన్నికల విన్యాసం : సుర్జేవాలా
ఈడీ ఛార్జ్‌షీట్‌ను చిల్లర ఎన్నికల విన్యాసంగా అభివర్ణించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా. లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్రమోదీ ఓటమి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఇదంతా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈడీ రోజుకో అబద్ధం తయారు చేస్తోందని అన్నారు. భయంతో ఉన్న మోదీ... ఈడీని కీలుబొమ్మగా చేసుకొని... పాత నిందలనే మళ్లీ వాడుతున్నారని ఎద్దేవా చేశారు.