భాజపాలో సంస్థాగతంగా కీలక మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్య నేతలకు నూతన బాధ్యతలు అప్పగించి కేంద్ర మంత్రివర్గంలో కీలక నేతలకు స్థానం కల్పించే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. యువత, మహిళలకు పార్టీలో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. భాజపా ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు పార్టీ ప్రాతినిధ్యంలో మహిళలకు 33 శాతం అవకాశాలు కల్పించలేదు. ఈ సారి అమలు చేయనుంది.
భాజపా జాతీయ కార్యనిర్వాహక బాధ్యతల్లో మహిళలకు తొలిసారి 33 శాతం అవకాశాలు కల్పించనుంది పార్టీ. భాజపా అనుబంధ సంస్థలైన యువ మోర్చా, కిసాన్ మోర్చా, వ్యాపార్ మోర్చాలలో కీలక బాధ్యతలను కొత్త నాయకులకు అప్పగించనుంది.
కీలక బాధ్యతలు..
పార్టీ ఉన్నత స్థాయి నిర్ణయాలు తీసుకునే కీలక కమిటీల్లో నాలుగు ఖాళీలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మాజీ కేంద్రమంత్రులు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, అనంత కుమార్ల మృతి, వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి కావడం వల్ల భాజపా పార్లమెంటరీ పార్టీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీలో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి.
ఈ కమిటీల్లో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర పడణవీస్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌లకు చోటు దక్కే అవకాశాలున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీలలో ఒకరికి అవకాశం లభించనుంది.
వారికే ప్రాధాన్యం..
భాజపాలో పార్లమెంటరీ పార్టీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీల పాత్రే అత్యంత కీలకం. పార్టీ కీలక విధానాలను ఇవే ఆమోదిస్తాయి. ఈ కమిటీల్లో ఉన్న వారికి పార్టీ అధ్యక్ష పదవి సహా ఇతర కీలక బాధ్యతలు నిర్వర్తించే అవకాశం దక్కుతుంది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం భాజపా ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గియ, భూపేంద్ర యాదవ్, రామ్ మాధవ్, మరళీధర్ రావులు ప్రస్తుతం ఉన్న బాధ్యతల్లోనే కొనసాగనున్నారు. కేంద్ర మాజీ మంత్రి మనోజ్ సిన్హాకు ప్రధాన కార్యదర్శి బాధ్యతలు, అనిల్ జైన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించే వీలుంది.
ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సరోజ్ పాండేకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలున్నాయి. ఆగస్టులోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగే వీలుంది. ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘబర్ దాస్‌ను పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించనున్నారని, అలాగే పార్టీ మీడియా కన్వినర్ బాధ్యతలను కొత్త వారికి అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
జేపీ నడ్డా అధ్యక్షతన భాజపాలో కీలక మార్పులు జరగనున్నాయి. అమిత్‌షా పాత బృందంతో కొనసాగడానికి బదులు సంస్థాగతంగా సమూల మార్పులు చేపట్టాలని నడ్డా భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.