నోట్ల రద్దు సమయంలో అక్రమ నగదు మార్పిడికి పాల్పడ్డారన్న కారణంతో ముగ్గురు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులకు నాలుగేళ్ల జైలుశిక్షను విధించింది దిల్లీ కోర్టు. నిందితులు ఒక్కొక్కరికి రూ. 4 లక్షల చొప్పున జరిమానా విధించింది. ఉద్యోగులు తాము ఎదగడానికి కారణమైన సంస్థకు అపఖ్యాతి తీసుకువచ్చారని వ్యాఖ్యానించింది.
నోట్ల రద్దు సమయంలో నిబంధనలకు విరుద్ధంగా రూ. 10.51 లక్షల పాత కరెన్సీని మార్చిన కేసులో బ్యాంక్ అధికారులు రామానంద్ గుప్తా, భువనేశ్కుమార్ జుల్కా, జితేందర్ వీర్ అరోరాలను దోషులుగా తేల్చారు ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ రాజ్‌కుమార్ చౌహాన్. ఈ నగదు మార్పిడి అనధికారికంగా, అక్రమంగా చేశారని పేర్కొన్నారు న్యాయమూర్తి.
"బ్యాంకు అధికారులు అత్యంత నిజాయతీగా వ్యవహరించాలి. ఈ చర్యలు వారి ఎదుగుదలకు కారణమైన సంస్థకు అపఖ్యాతి తీసుకువచ్చాయి. నోట్ల రద్దు తర్వాత బ్యాంకు ఉద్యోగుల అధికార దుర్వినియోగానికి ఈ కేసు చక్కటి ఉదాహరణ."
-విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్య
ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 120బీ- నేరపూరిత కుట్ర, 409- నమ్మకాన్ని వమ్ముచెయ్యడం, 471- ఫోర్జరీ పత్రాలను అసలైనవిగా చూపించడం, 477ఏ-అకౌంట్లలో తప్పులు, నేరనియంత్రణ చట్టంలోని 13వ అధికరణ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి నేరపూరిత ప్రవర్తన కింద కేసులు నమోదు చేసింది.
ప్రాసిక్యూషన్ వాదనల ప్రకారం 2017 ఏప్రిల్ 5న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉప సర్కిల్ హెడ్ ఈ కేసును దాఖలు చేశారు. 2016, నవంబర్ 8న నోట్ల రద్దు అనంతరం... డిసెంబర్ 30 వరకు నగదు మార్పిడికి అవకాశం కల్పించింది ప్రభుత్వం. రెండు సందర్భాల్లో తప్పుడు రికార్డుల ద్వారా నగదు మార్పిడి జరిగిందని తేల్చిచెప్పింది న్యాయస్థానం.
నోట్లరద్దు అనంతరం మార్గదర్శకాల ప్రకారమే ఆయా వినియోగదారులు కరెన్సీ మార్పిడి చేసినట్టు నగదు వోచర్లలో ఉందని... కానీ కంప్యూటర్లలో నిషేధ కరెన్సీగా ఉందని వెల్లడించారు.
ఈ వ్యవహారంపై 2017 ఏప్రిల్ 6న సీబీఐ ఛార్జీషీటు దాఖలు చేసింది. దీని ప్రకారం గుప్తా అనే వినియోగదారుడు... నాటి క్యాషియర్ అరోరా సాయంతో రూ. 9 లక్షలు ఒకసారి.. రూ. 1.51 లక్షలు మరోసారి ఎలాంటి అధికారిక అనుమతి లేకుండా మార్చారని కోర్టు తేల్చింది.
ఇదీ చూడండి: కాటేస్తున్న కాలుష్య ధూమం!