కరోనా లాక్‌డౌన్‌తో విద్యా వ్యవస్థ కుదేలైంది. విద్యార్థులకు ఏ విధంగా పాఠాలు చెప్పాలోనని అన్ని ప్రభుత్వాలు తర్జనభర్జన పడుతుంటే.. కేరళ మాత్రం నూతన విద్యా సంవత్సరాన్ని మొదలుపెట్టేసింది. ఇందుకోసం అంతర్జాలాన్ని వేదికగా చేసుకుంది.
కేరళ అధికారిక ఛానెల్ కైట్-విక్టర్‌లో 1 నుంచి 12వ తరగతి విద్యార్థులకు క్లాసులు మొదలయ్యాయి. సోమవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ ప్రక్రియను ప్రారంభించారు. దీనితో 45 లక్షలమంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ఇలా పూర్తిస్థాయిలో ఆన్లైన్లో పాఠాలు చెప్పడం దేశంలో ఇదే తొలిసారి.
ఒక్కో తరగతికి ఒక్కో టైమ్ స్లాట్ ఉంటుందని, సంబంధిత ఉపాధ్యాయులు విద్యార్థులతో నిరంతరం మాట్లాడుతూనే ఉంటారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
పవర్ కట్‌తో సతమతమయ్యే విద్యార్థుల కోసం.. కార్యక్రమాన్ని తిరిగి ప్రసారం చేస్తారు. ఇవి యూట్యూబ్‌లో కూడా అందుబాటులో ఉంటాయి.
"వెబ్, బ్రాడ్కాస్ట్, ఆఫ్లైన్లోనూ తరగతులను నిర్వహిస్తోంది కైట్-విక్టర్. ప్రతి క్లాసు కోసం ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించారు. వీరిలో ఒకరు 30 నిమిషాల పాటు క్లాస్ చెప్తారు. విద్యార్థులు ఆ క్లాస్‌ను చూస్తారు. రాత్రికి విద్యార్థులను టీచర్లు మొబైల్ ఫోన్ల ద్వారా సంప్రదిస్తారు. వారి ఫీడ్‌బ్యాక్‌ను తీసుకుంటారు. విద్యార్థుల సందేహాలను తీర్చే బాధ్యత సంబంధిత ఉపాధ్యాయులదే."
--- అన్వర్ సదాత్, కైట్ వైస్ ఛైర్మన్.
ఈ ప్రాజెక్ట్‌పై గత కొంతకాలంగా పని చేస్తున్నట్టు కైట్(కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్) తెలిపింది.
12వ తరగతి కోసం నాలుగు, 10వ తరగతి కోసం 3, 8-9 తరగతుల కోసం రెండు, మిగిలిన తరగతులకు ఒక్కో పీరియడ్‌ను కేటాయించింది ప్రభుత్వం. ఒక్కో తరగతి వ్యవధి 30 నిమిషాలు.
పక్కా ప్రణాళికతో...
ఈ ఆన్లైన్ తరగతులను అమలు చేయడానికి పక్కా ప్రణాళికలు రచించింది ప్రభుత్వం. టీవీలు, స్మార్ట్ఫోన్లు లేనివారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
"రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో 1.20లక్షల ల్యాప్‌టాప్‌లు, 80వేల ప్రొజెక్టర్లు, 4,500 టీవీలు ఉన్నాయి. టీవీ సదుపాయం లేని విద్యార్థులను ఇప్పటికే గుర్తించారు. ఒకే చోట ఉండే 5-10 విద్యార్థుల కోసం ఆయా ప్రదేశాల్లో టీవీలు ఏర్పాటు చేశాం. భౌతిక దూరం పాటించేలా కఠిన నిబంధనలను అముల చేశాం."
--- కైట్ అధికారి.
అయితే ఈ ఆన్లైన్ తరగతులు తాత్కాలికమే అని, పరిస్థితులు కుదుటపడ్డాక.. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాల్సిందేనని కేరళ విద్యాశాఖ మంత్రి సి. రవీంద్రనాథ్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:- పదవీ విరమణ రోజున కార్యాలయంలోనే డీజీపీ నిద్ర