ఈ నెల ప్రారంభంలో తూర్పు, దక్షిణాది రాష్ట్రాలను అతలాకుతలం చేసిన ఫొని తుపానును అంచనా వేయటంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) విజయవంతమైంది. ఎప్పటికప్పుడు తుపానుపై సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో భాగంగా సుమారు 65 లక్షల సంక్షిప్త సందేశాలను ప్రజల మొబైల్ ఫోన్లకు పంపామని కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొంది వాతావరణ శాఖ.
ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బంగాల్, అసోం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల రైతులకు 59 లక్షల సంక్షిప్త సందేశాలు పంపామని పేర్కొంది. ఫొని ధాటికి భారీగా దెబ్బతిన్న ఒడిశా రైతులకే సుమారు సగం సందేశాలు అందించినట్లు తెలిపింది.
ఏప్రిల్ 26 నుంచి మే 3 తేదీల మధ్య కాలంలో సందేశాలు ప్రజలకు అందాయి. కొన్ని సందేశాలు స్థానిక భాషలోనూ పంపించింది వాతావరణ శాఖ.
" పెంపుడు జంతువులు, పౌల్ట్రీ పక్షులను సురక్షిత ప్రాంతంలో ఉంచండి. వ్యవసాయ పనులను వాయిదా వేసుకోండి. ఏదైన సురక్షిత ప్రదేశం ఉంటే వ్యవసాయ ఉత్పత్తులను జాగ్రత్త పరుచుకోండి" .. అంటూ రైతులకు సందేశాలు పంపించింది.
ఐఎండీ వద్ద 40 లక్షల మంది రైతుల వివరాలు
భారత వాతావరణ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన గ్రామీణ కృషి మౌసమ్ సేవా ప్రాజెక్టులో సుమారు 40 లక్షల మంది రైతులు వివరాలను నమోదు చేసుకున్నారు. దీని ద్వారా వారికి ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులపై సమాచారాన్ని అందిస్తోంది వాతావరణ శాఖ .
పౌరులకూ..
సాధారణ పౌరులకు సుమారు 4 లక్షల సంక్షిప్త సందేశాలు పంపించింది ఐఎండీ. 2,140 సందేశాలు వివిధ రాష్ట్రాల విపత్తు నిర్వహణ బృందాల అధికారులకు చేరవేసింది.
కోల్కతా, భువనేశ్వర్, విశాఖపట్నంలోని జాతీయ వాతావరణ తుపాను హెచ్చరిక కేంద్రాలూ.. సుమారు 33,500 సందేశాలను పంపించాయని నివేదిక పేర్కొంది.
ఇదీ చూడండి: బడా రుణ ఎగవేతదారుల పేర్లు ఇవ్వండి: సీఐసీ