ఐఐటీ మద్రాస్ పరిశోధకులు సరికొత్త ఆవిష్కరణ చేశారు. భారత్‌లోని ఓడరేవులు, జలమార్గాల కోసం సౌరశక్తితో పనిచేసే మానవరహిత అటానమస్ 'సర్వే క్రాఫ్ట్'ను రూపొందించారు. దీన్ని ఉపయోగించి హైడ్రోగ్రాఫిక్, ఓషినోగ్రాఫిక్ సర్వేలను చేపట్టవచ్చు. సుదూర ప్రాంతాల నుంచి సైతం సమాచారాన్ని వేగంగా పంపించుకోవచ్చు.
![IIT Madras develops unmanned solar craft](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/the-solar-powered-unmanned-autonomous-survey-craft-developed-by-ntcpwc-iit-madras-being-field-tested-off-the-chennai-coast-at-kamarajar-port-tn_2311newsroom_1606115120_6.jpg)
చెన్నైలోని కామరాజర్ కోట నుంచి ఈ క్రాఫ్ట్‌ను విజయవంతంగా ప్రయోగించారు. మరింత కఠినమైన పరిస్థితుల్లో దీన్ని పరీక్షించేందుకు సిద్ధమయ్యారు. కోల్‌కతాలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ కోట నుంచి నవంబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఐఐటీ మద్రాస్‌కు చెందిన ఓడరేవులు, జలమార్గాలు, తీర ప్రాంతాల జాతీయ సాంకేతిక కేంద్రం ఇంఛార్జి ప్రొఫెసర్ మురళి తెలిపారు. షిప్పింగ్ మంత్రిత్వ శాఖ సహాయంతో ఈ సాంకేతికతను వాణిజ్యపరంగా మార్చేందుకు పరిశోధకులు కసరత్తులు చేస్తున్నారు.
"ఈ వ్యవస్థలో ఎకో సౌండర్, జీపీఎస్, బ్రాడ్‌బ్యాండ్ కమ్యునికేషన్ టెక్నాలజీ ఉంటాయి. అదనపు ఓషినోగ్రాఫిక్ పేలోడ్లను తీసుకెళ్లే అవకాశం ఉంది. 360 డిగ్రీల కెమెరా, స్థలాల ఆకృతి, నీటి లోతును కొలిచేందుకు ఉపయోగించే లైడార్ను సైతం తీసుకెళ్లొచ్చు."
-మురళి, ఐఐటీ మద్రాస్ ఇంఛార్జి ప్రొఫెసర్
ఎక్కువగా లోతు లేని జలాల్లోనూ ఈ వ్యవస్థ కచ్చితమైన కొలతలను అందిస్తుందని తెలిపారు మురళి. భారత సముద్రయాన రంగంలో విదేశీ సాంకేతికతనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారని, ఇలాంటి వ్యవస్థలను ఉపయోగించడం ద్వారా స్వదేశీకరణ వైపు అడుగులు వేయవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఇవి ఉపయోగపడతాయని చెప్పారు.
ఇదీ చదవండి- బంగాల్ ఎన్నికలకు ముందు ఎంఐఎంకు షాక్