దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఐఐటీ-బాంబే కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల భద్రత, ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు.. వచ్చే సెమిస్టర్ మొత్తాన్ని ఆన్లైన్లోనే నిర్వహించనుంది. ఫలితంగా 62ఏళ్ల ఇన్స్టిట్యూట్ చరిత్రలో క్యాంపస్‌లో విద్యార్థులు లేకుండా విద్యా సంవత్సరం ప్రారంభంకావడం ఇదే తొలిసారికానుంది.
"ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చించాం. చివరకు వచ్చే సెమిస్టర్‌ను ఆన్లైన్లో నిర్వహించాలని అంగీకరించాం. దీని వల్ల విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. విద్యార్థులకు పాఠాలు చెప్పే విధానాలపై కరోనా సంక్షోభం పునరాలోచింపచేసింది."
-- సుభాసిస్ చౌదరి, ఐఐటీ-బాంబే డైరక్టర్.
మరింత ఆలస్యం కాకుండా.. త్వరలోనే ఆన్లైన్ క్లాసులకు సంబంధించిన వివరాలను విద్యార్థులకు అందించనున్నట్టు సుభాసిస్ తెలిపారు.
"విద్యార్థుల్లో చాలా మంది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. ఆన్లైన్ తరగతులకు హాజరుకావడానికి వీరికి సహాయం చేయటం అవసరం. ఇక ఆలస్యమవకుండా ఇలాంటి తెలివైన విద్యార్థులు చదువు కోసం సహాయం చేయడానికి మీ మద్దతు ఎంతో అవసరం."
--- సుభాసిస్ చౌదరి, ఐఐటీ-బాంబే డైరక్టర్.
ఇతర ఐఐటీలు కూడా...
ఇతర ఐఐటీలు కూడా ఇదే మార్గంలో నడిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
"మహమ్మారి విసురుతున్న సవాళ్లను దృష్టిలో పెట్టుకుని.. విద్యా సంవత్సరాన్ని ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు. ఈ పరిస్థితుల్లో.. విద్యార్థులను క్యాంపస్‌లకు పిలవడం ఎప్పుడు వీలుపడుతుందో మనం చెప్పలేము. విద్యా సంవత్సరాన్ని ప్రారంభించి.. కంప్యూటర్, ఇంటర్నెట్ లేని విద్యార్థులకు ఏ విధంగా సహాయపడగలం అనే విషయంపై శ్రద్ధపెట్టడం శ్రేయస్కరం."
--- ఐఐటీ-దిల్లీ అధికారి.
ఇదీ చూడండి:- సీబీఎస్ఈ 10, 12వ తరగతుల పరీక్షలు రద్దు