కొవిడ్ నుంచి రక్షణ కల్పించే హెర్డ్ ఇమ్యూనిటీ దేశ ప్రజల్లో ఇంకా అభివృద్ధి కాలేదని అన్నారు కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్. ఈ నేపథ్యంలో ప్రజలు బహిరంగ, సామూహిక ప్రదేశాల్లో మాస్క్ ధరించటం సహా.. కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
కొవిడ్-19 రీ-ఇన్ఫెక్షన్లపై ఐసీఎంఆర్ ప్రత్యేక దృష్టి సారించిందని.. అయితే ప్రస్తుతానికి ఆ కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉందని వెల్లడించారు కేంద్ర మంత్రి. అదే సమయంలో త్వరలో విడుదలకానున్న సెరో సర్వే తుది ఫలితాలను ప్రజలు నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరించారు. సండే సంవాద్ ఆన్లైన్ కార్యక్రమంలో నెటిజన్లతో ఆయన ముచ్చటించారు.
ప్రభుత్వం, ప్రజలు కలిసికట్టుగా పోరాడితేనే మహమ్మారిని ఓడించగలమన్న కేంద్ర మంత్రి.. ప్రైవేట్ ఆస్పత్రులకు కొవిడ్ చికిత్సా విధానానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేశామని వెల్లడించారు. అలాగే కరోనా వైరస్ రూపాంతరం చెందుతూ ఊపిరితిత్తులతో పాటు ఇతర అవయవాలను దెబ్బతీస్తున్న నేపథ్యంలో.. వైద్య నిపుణులతో ఈ అంశంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని తెలియజేశారు.
ప్రైవేట్ ఆస్పత్రుల అధిక ఛార్జీలకు సంబంధించి ఇప్పటికే పలు రాష్ట్రాల ఆరోగ్య శాఖా మంత్రులతో చర్చించామని హర్షవర్ధన్ తెలిపారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని.. 2025 నాటికి జీడీపీలో 1.15 నుంచి 2.5 శాతం ఖర్చు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
ఈ ఏడాదిలో మే నెలలో విడుదలైన మొదటి సెరో-సర్వే నివేదిక... దేశంలో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ రేటు 0.73గా ఉన్నట్లు తేల్చింది. రెండో సెరో-సర్వే ఫలితాలు తర్వలో విడుదల కానున్నాయి.