కరోనా వైరస్ మరింత విస్తరించకుండా అడ్డుకునేందుకు పరీక్షా వ్యూహాన్ని మార్చాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నిర్ణయించింది. తీవ్ర శ్వాస సమస్య, జ్వరం, దగ్గు సమస్యలతో ఆసుపత్రుల్లో చేరేవారికి కూడా కొవిడ్-19 పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆయా సమస్యలతో ఆసుపత్రుల్లో చేరే వ్యక్తులకు 5 రోజులకు ఒకసారి, 14 రోజులకు మరోసారి పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
గత 14 రోజుల్లో అంతర్జాతీయ ప్రయాణాలు చేసి కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నవారికి మాత్రమే ఇప్పటి వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు తీవ్రమైన జ్వరం, దగ్గు సమస్యలు ఉన్న వారిని కూడా పరీక్షించనున్నారు. కరోనాను ఎదుర్కోవడంలో మరింత సమర్ధవంతంగా పని చేయడం సహా రోగులకు మెరుగైన చికిత్స అందించేందుకే పరీక్షా వ్యూహాన్ని మార్చినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. భారత్‌లో కరోనా రెండో దశ కొనసాగుతోందని...ఒక వేళ మూడో దశకు చేరితే తాజా పరీక్షా వ్యూహాన్ని కూడా మారుస్తామని వెల్లడించింది.