యాంటిజెన్ నిర్ధరణ పరీక్షలకు సంబంధించి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) మరికొన్ని సిఫార్సులను జారీ చేసింది. ఫలితం నెగిటివ్ వచ్చినప్పుడు ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ తో కలిపి స్టాండర్డ్ క్యూ కొవిడ్- 19 యాంటిజెన్ నిర్ధరణ పరీక్ష నిర్వహించాలని సూచనలు చేసింది.
ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల ద్వారా నెగిటివ్ వస్తే.. వారి శాంపిళ్లను మళ్లీ ఆర్టీ- పీసీఆర్ ద్వారా నిర్ధరించాలని స్పష్టం చేసింది ఐసీఎంఆర్. పాజిటివ్ వచ్చినట్లయితే కరోనా సోకినట్లు ధ్రువీకరించాలని, అప్పుడిక ఆర్టీ-పీసీఆర్ అవసరం లేదని పేర్కొంది.
స్టాండర్డ్ క్యూ యాంటిజెన్ నిర్ధరణలో టెస్టింగ్ కిట్‌కు శాంపిల్‌ను అందించగానే గరిష్ఠంగా 30 నిమిషాల్లో ఫలితాన్ని వెల్లడిస్తుంది. ఈ కిట్‌ను 2-30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సి ఉంటుంది. దీనికి అధిక సున్నితత్వం ఉన్న నేపథ్యంలో ఆర్టీ-పీసీఆర్‌తో కొన్ని సెట్టింగ్ కాంబినేషన్లతో కలిపి ధ్రువీకరించాల్సి ఉంటుందని ఐసీఎంఆర్ స్ఫష్టం చేసింది. ఏయే సందర్భాల్లో దీనిని అనుసరించాలో వివరణ ఇచ్చింది.
ఏ. కంటెన్మెంట్ జోన్ లేదా హాట్‌స్పాట్
వీరికి నిర్బంధ వైద్య పర్యవేక్షణ ఉండాలి. కిట్ ఉష్ణోగ్రత 2-30 డిగ్రీల సెల్సియస్ మధ్య స్టోర్ చేయాలి.
- ఇన్‌ఫ్లూయెంజా తరహా అనారోగ్య లక్షణాలు కనిపించిన వారికి పరీక్ష చేయాలి.
- లక్షణాలు లేకున్నా.. పాజిటివ్ కేసులతో సన్నిహితంగా ఉన్న (ఇప్పటికే ఊపిరితిత్తులు, గుండె, కాలేయం, మూత్ర పిండాల, డయాబెటిస్, నరాలు, రక్త హీనత వంటి సమస్యలతో బాధపడుతున్న)వారికి 5 నుంచి 10 రోజుల్లో పరీక్ష నిర్వహించాలి.
బీ. హెల్త్ కేర్ సెట్టింగ్స్
- ఆరోగ్య సంరక్షణ విభాగంలో పనిచేస్తున్నవారిలో ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలు కనిపించినా, వారికి కరోనా సోకినట్లు అనుమానం కలిగినా..
- ఆసుపత్రిలో చేరి లక్షణాలు లేకపోయినా, కీమోథెరపీ, హెచ్ఐవీ పాజిటివ్, అవయమ మార్పిడి, వృద్ధులు, దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నవారు..
- శస్త్ర చికిత్స చేయించుకున్నవారిలో లక్షణాలు లేకపోయినా యాంటిజెన్‌తో కలిపి నిర్ధరించాలి.
ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలు..
- శ్వాసకోశ ఇబ్బందులు
- 38 డిగ్రీలకు మించిన శరీర ఉష్ణోగ్రత
- తీవ్రమైన దగ్గు
పైన పేర్కొన్న ఏ,బీ కేటగిరీల్లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌ను సిఫార్సు చేసింది ఐసీఎంఆర్. అయితే వీటికి కొన్ని పరిమితులు విధించింది.
- యాంటిజెన్ టెస్టులో నెగటివ్ వచ్చినవారికి ఆర్టీ-పీసీఆర్ పరీక్ష కచ్చితంగా నిర్వహించాలి.
- శాంపిళ్లను పూర్తి స్థాయి పీపీఈలను ధరించి, శిక్షణ పొందిన ఆరోగ్య సిబ్బంది మాత్రమే సేకరించాలి.
- శాంపిల్ సేకరించిన గంటలోపు వైద్య పర్యవేక్షణలో నిర్ధరణ పరీక్ష చేయాలి.
కొన్ని ఇబ్బందుల కారణంగా..
కరోనా నిర్ధరణలో ఆర్టీ-పీసీఆర్ టెస్ట్‌కు ఉన్నత ప్రమాణాలు ఉన్నాయని ఐసీఎంఆర్ తెలిపింది. ఆర్టీ-పీసీఆర్ యంత్రాల్లో రెండు రకాలు ఉన్నాయని తెలిపింది. భారత్‌లో ప్రస్తుతం ఓపెన్ ఆర్టీ-పీసీఆర్, ట్రూనాట్, సీబీఎన్ఏఏటీ విధానాలను ఉపయోగిస్తున్నారు.
అయితే వీటన్నింటికి అన్నిరకాల భద్రతతో కూడిన ప్రత్యేక ల్యాబ్ సదుపాయం కావాలి. ఒక శాంపిల్‌ను పరీక్షించేందుకు కనీసం 2 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఈ కారణాలతో ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు పరిమితంగా ఉపయోగించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపింది ఐసీఎంఆర్.
అయితే ప్రపంచవ్యాప్తంగా పూర్తి స్థాయి ఫలితాలు ఇచ్చే యాంటిజెన్ టెస్టులు లేవని, అందువల్ల వ్యూహత్మకంగా వీటిని ఉపయోగించేందుకు సిద్ధమైంది ఐసీఎంఆర్.
ఇదీ చూడండి: ప్రభుత్వాల ఉమ్మడి వ్యూహంతోనే కరోనాపై విజయం!