వింగ్ కమాండర్ అభినందన్‌కు సైనిక ఆసుపత్రిలో రెండో రోజూ వైద్య పరీక్షలు నిర్వహించారు. పాక్ ఆధీనంలో అభినందన్ ఉన్నప్పుడు జరిగిన ఘటనలపై భద్రతా సంస్థలు (డీ బ్రీఫింగ్) ఆరా తీస్తున్నాయి. దేశ భద్రతా ప్రమాణాల ప్రకారం భారత పైలెట్ అభినందన్‌కు మరిన్ని వైద్య, మానసిక పరీక్షలు నిర్వహించనున్నారు.
వైద్యపరీక్షల్లో అభినందన్‌కు వెన్నెముక కిందివైపు మూడు గాయాలు అయ్యాయని తేలింది. మిగ్‌తో ఎఫ్-16ను కూల్చిన సమయంలో ఈ దెబ్బలు తగిలినట్లు గుర్తించారు. ఎమ్ఆర్ఐ స్కానింగ్ చేసి అతని శరీరంలో ఎలాంటి 'బగ్స్' లేవని వైద్యులు తేల్చారు.
డీ బ్రీఫింగ్
యుద్ధ విమానం కూలిపోయి పాక్ భూభాగంలో దిగినప్పటి నుంచి తిరిగి భారత్ చేరుకున్నంత వరకు జరిగిన పరిణామాలపై అభినందన్‌పై భద్రతాసంస్థలు ప్రశ్నలు సంధించాయి. ఈ దర్యాప్తు మరికొన్ని రోజులపాటు కొనసాగే అవకాశం ఉంది.
అనంతరం భారత వైమానిక దళానికి చెందిన కొంత మంది ఉన్నత అధికారులు అభినందన్‌కు కలుసుకున్నారు. తను త్వరలోనే విధుల్లోకి వస్తారని, యుద్ధ విమానం నడుపుతారని ఓ అధికారి వ్యాఖ్యానించారు.
భిన్న పరీక్షలు
సాధారణంగా శత్రు చెర నుంచి బయటపడిన సైనికులకు భద్రతా నియమాల ప్రకారం శారీరక, మానసిక పరీక్షలు నిర్వహిస్తారు. అందులో భాగంగానే పాక్ నుంచి భారత్ చేరుకున్న అభినందన్‌ను మొదటగా 'భారత వైమానిక దళ కేంద్ర వైద్య పరీక్షా కేంద్రానికి' (ఏఎఫ్సీఎమ్ఈ) తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం భారత సైన్యానికి చెందిన రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ జరిగింది...
భారత భూభాగంపై పాక్ చేసిన దాడిని భారత వైమానిక దళం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఆ సమయంలో పాక్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని వింగ్ కమాండర్ అభినందన్ కూల్చివేశారు. ఆ క్రమంలో తన మిగ్-21 యుద్ధ విమానాన్ని కోల్పోయి, పాక్ భూభాగంలో పారాచూట్‌తో దిగారు. స్థానిక యువకులు అతనిపై భౌతికదాడి చేశారు. అనంతరం అభినందన్‌ను పాక్ సైన్యం తమ ఆధీనంలోకి తీసుకుంది.
పాక్ సైన్యం ఆధీనంలో ఉన్నప్పుడు అభినందన్ చూపించిన తెగువ, ధైర్యం, ఆత్మవిశ్వాసం భారతీయుల హృదయాలను హత్తుకుంది.
అనంతరం భారత్ దౌత్యం, అంతర్జాతీయ ఒత్తిడి మేరకు, శాంతిసూచకంగా అభినందన్‌ను విడిచిపెడుతున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించారు. దీంతో మూడు రోజుల అనంతరం శుక్రవారం నాడు వాఘా సరిహద్దు గుండా అభినందన్ భారత్ చేరుకున్నారు.