కన్నడనాట భాజపా పాగా వేసేందుకు ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రిగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. యడ్యూరప్పకు సీఎంగా ప్రమాణం ఇది నాలుగోసారి.
భాజపా నేతలతో కలిసి యడ్యూరప్ప ఈ రోజు ఉదయం రాజ్‌భవన్ వెళ్లారు. తమకు సంఖ్యాబలం ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ వాజూభాయ్ వాలాను కలిసి విన్నవించారు. సానుకూలంగా స్పందించిన గవర్నర్.. ఈ రోజు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయాలని ఆహ్వానించారు. అయితే.. జులై 31లోగా విధానసభలో బలం నిరూపించుకోవాలని గడువు విధించారు.
గవర్నర్‌తో భేటీ అయిన అనంతరం.. మీడియాతో మాట్లాడారు యడ్యూరప్ప. ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వెల్లడించారు. ప్రమాణ కార్యక్రమానికి కుమారస్వామి, సిద్ధరామయ్యలను స్వయంగా ఆహ్వానించినట్లు తెలిపారు.
''ఇప్పుడే రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశా. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని, అలాగే కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతించాలని కోరా. ఆయన అంగీకరించారు. ఈ రోజు 6 నుంచి 6.15 గంటల మధ్య ప్రమాణం స్వీకారం చేస్తా.''
- బీఎస్ యడ్యూరప్ప, కర్ణాటక భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
బలపరీక్షలో 'కుమార' ఓటమి
కర్ణాటక విధానసభలో విశ్వాసం కోల్పోయింది కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జేడీఎస్ సర్కారు. ఈ నెల 23న జరిగిన బలపరీక్షలో మెజారిటీ కోల్పోయింది సంకీర్ణ ప్రభుత్వం. ఫలితంగా.. 14 నెలల కూటమి అధికారానికి తెరపడింది. అనంతరం.. గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించారు కుమారస్వామి. నూతన ప్రభుత్వం కొలువుదీరే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు.
స్పీకర్‌పైనే...?
కర్ణాటక అసెంబ్లీ స్పీకర్.. గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజీనామాలు సమర్పించిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. ఈ కారణంగా విధానసభలో ఎమ్మెల్యేల సంఖ్య స్పీకర్‌ను మినహాయిస్తే 224 నుంచి 220కి చేరింది.
ఫలితంగా... ప్రభుత్వ ఏర్పాటుకు 111 మంది శాసనసభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుతం భాజపాకు స్వతంత్ర ఎమ్మెల్యే నగేశ్‌తో కలిపి 106 మంది మద్దతు మాత్రమే ఉంది. రాజీనామాలు చేసిన అసంతృప్త ఎమ్మెల్యేలు.. కాషాయ పార్టీకి మద్దతిస్తారా అనేది ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తానికి.. ప్రభుత్వం ఏర్పడినా నిలిచేందుకు స్పీకర్ నిర్ణయం కీలకం కానుంది.
ఇదీ చూడండి: కర్ణాటకీయం: మళ్లీ మొదటికి వచ్చిన సంక్షోభం