కరోనా సంక్షోభం నెలకొన్న వేళ యువత మంత్రం 'స్కిల్, రీ-స్కిల్, అప్ స్కిల్' అయ్యుండాలని ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు.. స్కిల్ ఇండియా మిషన్ ఐదో వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వర్చువల్ ఈవెంట్లో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
నైపుణ్య భారత్
యువత నైపుణ్య భారత్ దిశగా అడుగులు వేయాలని ప్రధాని దిశా నిర్దేశం చేశారు. ఉన్నత శిఖరాలు చేరాలంటే కొత్త నైపుణ్యాలు తప్పనిసరి అని పేర్కొన్న ఆయన.. నైపుణ్యం పెంచుకుంటేనే ఆత్మగౌరవం పెరుగుతుందని స్పష్టం చేశారు. ఎవరికి వారు వ్యక్తిగతంగా అభివృద్ధి చెంది... దేశ పురోగతికి తోడ్పడాలని ఆకాంక్షించారు.
జ్ఞానం, నైపుణ్యం ఒక్కటి కాదు
"కొంత మంది ఎల్లప్పుడూ జ్ఞానం-నైపుణ్యాల మధ్య గందరగోళం సృష్టిస్తారు. వారికి నేను చెప్పేది ఒక్కటే. మీరు సైకిల్ గురించి పుస్తకంలో చదివి, అంతర్జాలయంలో వెతికి తెలుసుకోవచ్చు. కానీ ఆ జ్ఞానంతో మీరు సైకిల్‌తో నడపలేరు. సైకిల్ నడపాలంటే కచ్చితంగా నైపుణ్యం కావాలి. "
- ప్రధాని మోదీ
అవకాశాలు కోకొల్లలు
నేడు వేగంగా మారుతున్న ప్రపంచానికి, లక్షలాది నిపుణుల అవసరముందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ముఖ్యంగా ఆరోగ్య సేవల్లో భారీ అవకాశాలు ఉన్నాయని గుర్తుచేశారు.
గ్రామ చైతన్యం!
కరోనా సంక్షోభం, లాక్డౌన్ కారణంగా స్వస్థలాలకు చేరుకున్న వలసకార్మికుల గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ.... వారు తమ నైపుణ్యాలతో గ్రామాల్లో నూతన చైతన్యం నింపడం ప్రారంభించారని కొనియాడారు.
"కొందరు వలసకార్మికులు పాఠశాలలకు రంగులు వేస్తున్నారు. మరికొందరు కొత్త ఇళ్లు నిర్మిస్తున్నారు."
- ప్రధాని మోదీ
ఇదీ చూడండి: నేడు 15వ 'భారత్-ఈయూ' సదస్సు.. మోదీ హాజరు