తన ఆరోగ్యం బాగానే ఉందని, కరోనా వైరస్ నుంచి బయటపడేందుకు వైద్యులు సూచించిన అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నట్టు భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. నిన్న కరోనా పాజిటివ్‌గా తేలిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఆరోగ్యంపై ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా త్వరగా కోలుకోవాలంటూ కాంక్షించిన అందరికీ వెంకయ్యనాయుడు కృతజ్ఞతలు తెలిపారు.
వెంకయ్యకు కరోనా సోకిందనే విషయం తెలియగానే దేశవ్యాప్తంగా ఆయన శ్రేయోభిలాషులు, పార్టీల నేతలు స్పందించారు. త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా సందేశాలు పంపారు. మాల్దీవుల ఉపరాష్ట్రపతి ఫైజల్ నసీం కూడా ఆందోళన వ్యక్తం చేశారు. వెంకయ్య నాయుడు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు. అందుకు ఆయనకు ఉపరాష్ట్రపతి కృతజ్ఞతలు తెలిపారు. తాను బాగానే ఉన్నానని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా బారిన పడినట్టు ఆయన కార్యాలయం మంగళవారం రాత్రి ప్రకటించింది. అయితే ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని, ఆరోగ్యంగా ఉన్నారని ట్విట్టర్లో తెలిపింది. ఉదయం సాధారణంగా కొవిడ్-19 పరీక్షలు చేయించుకున్నప్పుడు ఉపరాష్ట్రపతికి కరోనా పాజిటివ్ అని తేలిందని, లక్షణాలేమీ లేవంది. వైద్యుల సూచనలతో ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లోనే ఉంటున్నారు. ఆయన సతీమణి ఉషా నాయుడుకు నెగెటివ్ రాగా... ఆమె ఐసొలేషన్‌లో ఉన్నారు.
ఇదీ చూడండి: అన్‌లాక్-5: సినిమా హాళ్లు తెరిచేందుకు కేంద్రం అనుమతి