ఓ వ్యక్తి తన భార్యను పాముతో కరిపించి చంపిన దారుణ ఘటన కేరళ కొల్లాం జిల్లా అంచల్లో జరిగింది. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఇది పథకం ప్రకారం చేసిన హత్యగా తేల్చారు.
అంచల్ పట్టణానికి చెందిన ఉత్రా, సూరజ్ భార్యాభర్తలు. వీరి పెళ్లి సమయంలో సూరజ్ 98 కాసుల బంగారం, నగదు కట్నంగా తీసుకున్నాడు. ఇప్పటికే చాలా బంగారం అమ్మేశాడు. కొన్నాళ్లుగా బాగానే ఉన్న సూరజ్... తరువాత మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకు అడ్డంగా ఉన్న తన భార్యను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీనితో ఆమెను అనుమానం రాకుండా హత్య చేయాలని పథకం వేశాడు.
యూట్యూబ్‌లో క్రైమ్ పాఠాలు..
యూట్యూబ్‌లో చూసి పాముల ద్వారా ఎలా హత్య చేయాలో నేర్చుకున్నాడు. తరువాత సురేష్ అనే పాములవాడికి డబ్బులు ఇచ్చి పామును తీసుకున్నాడు. ఈ మార్చి 2న మొదటిసారిగా తన భార్య ఉత్రాపై హత్యాయత్నం చేశాడు. అయితే ఆమె సకాలంలో ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవడం వల్ల ప్రాణాలు దక్కించుకోగలిగింది. అయితే సూరజ్‌పై ఎవరికీ అనుమానం కలగలేదు. దీనితో అతనికి మరింత ధైర్యం వచ్చింది. దీనితో మే 6న మరోసారి హత్యకు కుట్ర పన్నాడు.
నిద్రపోతున్న భార్యపై...
సురేష్ నుంచి ఓ పామును తీసుకున్న సూరజ్ దానిని బ్యాగులో దాచి ఉంచాడు. తరువాత ఇంటికి వచ్చి నిద్రపోతున్న భార్యపై ఆ పామును విసిరేశాడు. ఆ పాము ఉత్రాను రెండు సార్లు కాటువేసింది. ఆ తరువాత ఆ పామును ఓ కంటైనర్‌లో బంధించాలని సూరజ్ ప్రయత్నించాడు కానీ కుదరలేదు. పాము ఇంటిలోని కబోర్డులోకి వెళ్లిపోయింది. దీనితో చేసేదేం లేక రాత్రంతా ఇంట్లోనే నిద్రపోకుండా ఉండిపోయిన సూరజ్... ఉదయన్నే బయటకు వెళ్లిపోయాడు.
కూతురు మృతిపై అనుమానం
ఉత్రా పాము కాటుతో మరణించడం.. ఇంతకు ముందు కూడా ఆమె పాముకాటుకు గురికావడంపై ఆమె తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు సూరజ్‌ను అదుపులోకి తీసుకుని... తమదైన శైలిలో విచారణ చేశారు. దీనితో సూరజ్ కుట్ర మొత్తం బయటపడింది.
ఇదీ చూడండి: వలస వేదన: శ్రామికుల్ని ఆదుకోలేమా?