అమెరికా హ్యూస్టన్లో సెప్టెంబర్లో జరగబోయే 'హౌడీ మోదీ' కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ప్రధాని నరేంద్రమోదీని చూసేందుకు ప్రవాస భారతీయులు ఉత్సాహం చూపిస్తున్నారు. అంచనాలకు తగ్గట్లు ఇప్పటికే 50 వేల మంది పాసుల కోసం పేర్లు నమోదు చేసుకున్నారు.
ఐక్యరాజ్య సమితి వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబరులో అమెరికా వెళ్తున్నారు. సెప్టెంబరు 22న అక్కడి భారతీయులు నిర్వహించే 'హౌడీ మోదీ' కార్యక్రమానికి హాజరుకానున్నారు. అమెరికాలో అతిపెద్ద ఫుట్బాల్ స్టేడియాల్లో ఒకటైన ఎన్ఆర్జీని ఈ కార్యక్రమానికి వేదికగా ఎంచుకున్నారు నిర్వాహకులు.
ప్రత్యేక వెబ్సైట్
మోదీకి ఘన స్వాగతం పలికేందుకు భారత సంతతికి చెందిన 50 వేల మంది తరలివస్తారని అంచనా వేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు దాదాపు 650 ప్రవాస భారతీయ సంఘాలు ఉత్సాహం కనబరుస్తున్నాయి. మోదీని చూడడానికి వచ్చేవారికి పాస్లు అందించేందుకు వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆగస్టు 12 నుంచి పేర్లు నమోదు చేసుకునే వీలు కల్పించారు నిర్వాహకులు.
అతిపెద్ద కార్యక్రమం
రికార్డు స్థాయిలో..'హౌడీ, మోదీ సదస్సు' భారత సంతతి వ్యక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్న కార్యక్రమంగా నిలువనుందని నిర్వాహకులు చెబుతున్నారు.
అమెరికాలో సుమారు 5 లక్షల మందికి పైగా భారత సంతతి వారుంటే.. అందులో అధిక శాతం హ్యూస్టన్లోనే ఉన్నారు.2014లో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అమెరికాలోని భారత సంతతి ప్రజలతో మోదీ సమావేశమవుతుండటం ఇది మూడోసారి.
ఇదీ చూడండి:అధ్యయనం: దేనివల్ల.. ఎంత భూతాపం ?