కరోనా ప్రభావం కారణంగా పిల్లలు, పెద్దలు అందరూ ఇళ్లలోనే ఉంటున్నారు. ఈ సమయంలో పెద్దలు ఇంట్లోని పనుల్లో తీరికలేకుండా ఉంటారు. అయితే, ఎప్పుడూ స్నేహితులతో సరదాగా ఆడుకునే పిల్లలు మాత్రం బడికి దూరమై, మిత్రులతో కలిసి ఆడుకోలేక ఎటూ పాలుపోని స్థితిలో ఉంటున్నారు.
ఇంట్లోనే ఉండటం, తినటం, టీవీ చూడటం, నిద్రపోవడం.. ఇలా రోజలు గడిచిపోతున్నాయి. పిల్లలంటేనే అల్లరి, ఆటాపాటా. వాటికి దూరంగా ఉంచితే, వారి మనసు నొచ్చుకోవడమే కాక వారిని తీవ్ర ఆవేదనకు గురిచేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటప్పుడు తల్లిదండ్రులే స్నేహితులుగా మారి పిల్లలు మానసిక ఆందోళన చెందకుండా చూసే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు.
ఏం చేయాలంటే..?
తల్లిదండ్రులు వారి పిల్లలతో సరదాగా గడపాలి. వారి భయాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి. వారిలో ధైర్యం నింపాలి. వారు చెప్పే మాటల్ని ఆసక్తిగా విని వారి భాషలోనే పలకరించే ప్రయత్నం చేయడం మంచిది.
ఒంటరిగా ఉన్నప్పుడు పిల్లల్లో తెలియని భయం ఉంటుంది. ఏదో పోగొట్టుకున్నామనే ఆవేదనకు గురవుతుంటారు. అందుకే వీలైనంత సేపు వారితో గడిపండి. పిల్లల్ని ఖాళీగా ఉంచకుండా కథలు చెప్పండి. వారితో చెప్పించే ప్రయత్నం చేయండి. అప్పుడు చిన్నారుల్లో వారిపట్ల మీకు ఎంత ప్రేమ ఉందో వారు తెలుసుకొంటారు.
వారి భాషలోనే..
పిల్లలతో ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలి. పిల్లలతో మాట్లాడాలంటే ముందుగా వారి భాషపై అవగాహన, పట్టు పెంచుకోవాలి. అనంతరం ఏం చెప్పాలనకున్నా వారు ఉపయోగించే పదబంధంతో, వారికి అర్థమయ్యేలా చెప్పొచ్చు.
కరోనాపై ప్రపంచం ఏవిధంగా పోరాడుతోందో వారి భాషలోనే అర్థమయ్యేలా వివరించాలి. ముఖ్యంగా ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో నేర్పాలి. తరచూ చేతుల్ని శానిటైజర్లు, సబ్బుతో శుభ్రం చేసుకొనేలా చూడాలి. వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంచాలి. పిల్లల ప్రవర్తన, తినే విధానం, అలవాట్లలో ఏవైనా మార్పు, అనుమానాలు వస్తే వెంటనే కుటుంబ వైద్యులు లేదా పిల్లల మానసిక నిపుణుల్ని సంప్రదించండి. వీలైతే వారి క్లాస్ టీచర్‌తోనూ మాట్లాడించే ప్రయత్నం చేయాలి.
ఆటలతో..
లాక్‌డౌన్ కారణంగా బయటకు వెల్లే వీలులేనందున పిల్లలు ఇంట్లోనే ఆడుకునేలా చూడండి. ఇంట్లోనే క్యారమ్స్, చదరంగం ఆటల్ని ఆడించండి. సుడోకు, పజిల్స్ పరిష్కరించడం వంటి చేయించడం ద్వారా పిల్లల్లో మేధోశక్తి పెరుగుతుంది. వీలైతే తీరిక సమయాల్లో వారితో కలిసి ఆడుతూ, వారికి మిత్రులు లేని లోటును తీర్చండి.
మంచి పుస్తకాలు చదివించండి. మిత్రులు, తోటి విద్యార్థుల్ని కలిసి చాలా రోజులైనందున వారితో రోజూ ఫోన్లో మాట్లాడించండి. వీడియో కాల్ ద్వారా వారిని చూసే అవకాశం కల్పిస్తే పిల్లలు మురిసిపోతారు.
చదివించాలి..
పాఠశాలలు మూతపడటం వల్ల పిల్లలు చదివే అలవాటు మర్చిపోయే అవకాశమూ ఉంది. రోజూ వారిచే పుస్తకాలు, పాఠాలు చదివించాలి. వారి స్కూల్ టీచర్‌ను సంప్రదించి రోజూ వారికి ఏదో ఒక పని అప్పగించేలా చూడండి. ఇంట్లోనే వారికి పరీక్ష నిర్వహించి, వారి సామర్థ్యాన్ని తెలుసుకోవచ్చు.
బొమ్మలు గీయడం, వాటి ఆధారంగా కథలు చెప్పడం నేర్పించాలి. పిల్లలు బడికి వెళ్లి వారాలు గడుస్తున్నందున.. ఇంట్లో ఉన్నా వారికి స్కూల్లోనే ఉన్నామనే వాతావరణం కల్పించండి. ఇష్టమైన పాటలు వినిపించడమో, వారితో పాడించడం చేయండి. ఈ చిట్కాలన్నీ పిల్లలు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేలా చేస్తాయని నిపుణులు అంటున్నారు.
కరోనా గురించి చెప్పండి..
కరోనా సంబంధిత ప్రశ్నలు అడిగితే, వాటిని దాటవేయకుండా వారికి సమాధానం ఇచ్చేలా ప్రయత్నించండి. మీరిచ్చే సమాధానంపైనే వారిలోని భయం పెరగడం, తగ్గడం ఆధారపడి ఉంటాయి. కొవిడ్ గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం వారిలో ఉంటే మీకు తెలిసిన విషయాల్ని వారితో పంచుకోండి.
కరోనా ఎంత ప్రమాదకరమో వివరిస్తూనే సరైన జాగ్రత్తలు పాటిస్తే, వైరస్‌ను అరికట్టగలమని వారిలో భరోసా నింపండి. పిల్లలపై చిరాకు పడకుండా సహనంతో మెలగండి. రాత్రి పూట మంచి కథలు చెబుతూ నిద్రపుచ్చండి. లేదా తల్లిదండ్రుల వద్దే పిల్లల్ని పడుకోబెట్టుకోవాలి.
ఆరోగ్యంపై నిర్లక్ష్యం తగదు..
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తమ వంతుగా ఏం చేయాలో పిల్లలకు చెప్పాలి. సామాజిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా కడిగించడం చేయాలి. మాస్కులు ధరించేలా చూడాలి. దగ్గు, జ్వరం, జలుబులాంటి కరోనా లక్షణాలు ఏమాత్రం కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. పిల్లలు ఒక వేళ అనారోగ్యానికి గురైతే ఏంచేయాలో ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుంటే, అత్యవసర సమయంలో జాగ్రత్త పడవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: 'కాబోయే అమ్మ'పై కరోనా వైరస్ ప్రభావం