భారత్-చైనా మధ్య ఎల్‌ఏసీ వివాదం ఇప్పట్లో తెగేలా లేదు. అక్టోబర్ 12 నుంచి ఇరు దేశాల సైనిక కమాండర్లు ఏడో సారి భేటీ కానున్నారు. ప్రతి భేటీలో ఏదో ఒక కొత్త అంశం తెరపైకి వచ్చి వివాదం చిక్కుముడి పడటమే కానీ.. ఉపశమనం లభించింది లేదు. గత భేటీలో అదనపు దళాలను తరలించ కూడదని ఇరు దేశాలు నిర్ణయించాయి. కానీ, చైనా మాత్రం సరిహద్దుల సమీపానికి ఆయుధాల తరలింపు ఏమాత్రం తగ్గించలేదు. దీంతో భారత దళాలు చైనాను నమ్మి వెనక్కి తగ్గే అవకాశం లేదు. దీంతో ఈ సారి శీతాకాలం కూడా వెనక్కి తగ్గకూడదని సైన్యం నిర్ణయించింది. దీంతో కీలక స్థానాల్లో, పర్వతాలపై పట్టు కొనసాగించాలని నిర్ణయించుకొంది. దీనికి తగ్గట్లు ఏర్పాట్లు చేసుకొంటోంది.
ప్రత్యేకమైన వింటర్ గ్రేడ్ డీజిల్ డిపోల ఏర్పాటు..!
లద్దాఖ్‌లో వాడేందుకు అవసరమైన ప్రత్యేకమైన వింటర్ గ్రేడ్ డీజిల్‌ను సైన్యం సమకూర్చుకుంటోంది. అతి శీతల ప్రదేశాల్లో సాధారణ డీజిల్‌లోని పారఫిన్ వ్యాక్స్ చిక్కబడిపోతుంది. ఫలితంగా వాహనాల ఇంజిన్‌లో ఇది ప్రవహించకుండా అడ్డుపడుతుంది. డీజిల్ పంపు నుంచి వాహన ట్యాంకులోకి కూడా దీనిని పంపించడం కష్టంగా మారుతుంది. కిరోసిన్ కలపడం, వేడిచేయడం వంటివి చేస్తే సమస్యలు వస్తాయి. అందుకే.. ఇటువంటి సమస్యలను అధికమించడానికి సైన్యం ప్రత్యేకంగా వింటర్ డీజిల్‌ను వాడుతుంది. ఇది మైనస్ 33 డిగ్రీల చలిలో కూడా స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. పానిపట్ రిఫైనరీలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వీటిని ప్రత్యేకంగా తయారు చేస్తోంది.
దాదాపు 40వేల మంది సైనికుల శీతాకాల అవసరాలు తీర్చేలా భారీ అండర్ గ్రౌండ్ ఇంధన ట్యాంకులను సిద్ధం చేసింది. ఒక్కోదానిలో దాదాపు 4లక్షల లీటర్ల ఇంధనం పడుతుంది. కొన్ని ప్రత్యేక అవసరాల నిమిత్తం కిరోసిన్ కూడా నిల్వ చేస్తోంది. అంతేకాదు శీతాకాలంలో హిమ శిఖరాలు మరింత గడ్డకట్టుకుపోతాయి.. దీంతో సైన్యానికి తాగునీటికి ఇబ్బంది తలెత్తుతుంది. ఈ సమస్య నివారించడానికి నీటి వనరులను కూడా సైన్యం సమకూర్చుకుంటోంది. నీటి వనరులను గుర్తించడానికి సైన్యం భూవిజ్ఞాన శాస్త్రవేత్తలను నియమించింది. దౌలత్‌బేగ్ ఓల్డీ, డెప్సాంగ్, పాంగాంగ్ ప్రాంతాల్లో వీరు మంచినీటి కోసం అన్వేషణ సాగిస్తున్నారు.
హిమగిరులకు జంబో విమానాలు
భారత్ వాయుసేన అమ్ములపొదిలో భారీ విమానాలు లద్దాఖ్ దిశగా క్యూకట్టాయి. సీ-17 గ్లోబ్‌మాస్టర్, ఐఎల్-76, సీ-130జే వంటి భారీ విమానాలు ఉపయోగించి సైన్యానికి అవసరమైన సామగ్రిని చేరవేస్తున్నారు. దీంతోపాటు దాదాపు 6,000 ట్రక్కులు రేషన్‌ను నిరంతరాయంగా చేరవేస్తున్నాయి. దుస్తులు, టెంట్లు, చమురు వంటి కీలకసామగ్రి వీటిల్లో ఉంటోంది.
మొబైల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్స్(ఏటీసీ)..
భారీ సంఖ్యలో యుద్ధ, రవాణా విమానాలు, హెలికాప్టర్లు లద్దాఖ్ ప్రాంతానికి చేరుకోవడంతో.. లేహ్‌లోని ఏటీసీకి అదనంగా పలు మొబైల్ ఏటీసీలను ఏర్పాటు చేశారు. సైన్యం ఆధ్వర్యంలో మొబైల్ ఏటీసీలను ఇక్కడకు రప్పించారు. ఇవి టీవీ ఛానళ్లు వినియోగించే ఓబీ వ్యాన్లను పోలి ఉంటాయి.
కస్ఘర్‌కు చైనా బాంబరు..
మరోపక్క ఎల్‌ఏసీ సమీపంలోకి ఆయుధాల చేరవేతను చైనా మానలేదు. కారాకోరం పాస్‌కు 475 కిలోమీటర్ల దూరంలోని షిన్‌జియాంగ్ రీజియన్‌లోని కస్ఘర్ వైమానిక స్థావరంలో కీలక బాంబర్ విమానాలను మోహరిస్తోంది. హెచ్-6 బాంబర్లును ఇటీవల భారత్‌కు చెందిన ఓపెన్‌సోర్స్ ఇంటెలిజెన్స్ నిపుణులు గుర్తించారు. వీటికి చైనాకు చెందిన కేడీ-63 క్రూజ్ క్షిపణులను అమర్చినట్లు గుర్తించారు. వీటిని గాల్లో నుంచి భూఉపరితలంపై లక్ష్యాలను ఛేదించేందుకు ప్రయోగిస్తారు. సుదూర ప్రాంతాలకు ప్రయాణించి బాంబింగ్ చేయడానికి వాడతారు. ఇరు దేశాల సైనిక కమాండర్ల ప్రకటన తర్వాత ఈ క్షిపణులతో ఉన్న విమానాలు కనిపించడం సందేహాస్పదంగా మారింది. ఈ విమానాలు చైనా వాయుసేనకు చెందిన 36వ ఎయిర్ డివిజన్‌లోని 108 రెజిమెంట్‌కు చెందినవిగా భావిస్తున్నారు. ఇవన్నీ భారత్‌లో దాడులు చేయాలన్న చైనా ఉద్దేశాలను వెల్లడిస్తున్నాయి.
కొత్తగా 1959 నాటి చైనా ప్రీమియర్ ఝావో ఎన్‌లై ప్రతిపాదించిన ఎల్‌ఏసీని అంగీకరిస్తామని కొన్నాళ్ల క్రితం చైనా ప్రతినిధి ఒక ఆంగ్లపత్రికకు తెలిపారు. ఇది భారత్‌కు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ప్రస్తుత ఎల్‌ఏసీ ఆధారంగానే 1993, 1996, 2005లో ఒప్పందాలు కుదిరాయి. ఇప్పుడు దానిని గుర్తించకపోతే ఆ ఒప్పందాల అమలు అటకెక్కుతుంది. ఫలితంగా ఎల్‌ఏసీ వద్ద తీవ్రమైన ఉద్రిక్తత నెలకొంది. భారత సరిహద్దుల్లో ఉద్రిక్తతను పెంచాలనే చైనా ఉవ్విళ్లూరుతోంది.. అందుకే భారత్‌కు ఏమాత్రం ఆమోదయోగ్యంకాని ప్రతిపాదనలు చేస్తోంది.