కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. అర్ధరాత్రి 2 గంటల సమయంలో దిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న షా ఎయిమ్స్‌లో చేరారని.. ఎయిమ్స్ ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. డాక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలో ఆయనకు చికిత్స జరుగుతోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అమిత్ షా ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆసుపత్రి నుంచే విధులు నిర్వర్తిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇటీవల కొవిడ్ సోకడంతో గురుగ్రామ్ మేదాంత ఆసుపత్రిలో అమిత్ షాకు చికిత్స అందించారు. మరోసారి పరీక్షల్లో నెగెటివ్ వచ్చినట్లు ఈ నెల 14న అమిత్ షా ట్వీట్ చేశారు. తాజాగా శ్వాస ఇబ్బందులతోపాటు రెండు మూడు రోజులగా ఒంటి నొప్పులు కూడా రావడంతో అమిత్ షా ఎయిమ్స్‌లో చేరారని వైద్యులు తెలిపారు. వైద్యుల సలహా మేరకు.. ఆయన మరికొన్ని రోజులు స్వీయ నిర్బంధంలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.