బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఓడించేందుకు దిల్లీ నుంచి ఎవరూ రావాల్సిన అవసరం లేదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రాష్ట్ర ప్రజలే మార్పు కోరుకుంటున్నారని, దీదీ ఆలోచనలను అంగీకరించరని పేర్కొన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డాపై రాళ్లదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరు తమ అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు ఉండాలని భాజపా విశ్వసిస్తుందన్నారు.
బీర్భమ్ జిల్లా బోల్పుర్లో రోడ్ షో అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు షా. టీఎంసీ, మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
" దాడులతో భాజపా ఆగిపోతుందనే తప్పుడు అభిప్రాయంలో ఉండకూడదని టీఎంసీ నాయకులందరికీ చెప్పాలనుకుంటున్నా. బంగాల్లో రాజకీయ హింస తీవ్ర స్థాయిలో ఉంది. 300 మంది భాజపా కార్యకర్తలు హత్యకు గురయ్యారు. వారి మరణాలపై దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదు. మమతా బెనర్జీ.. రైతుల ఆందోళనకు మద్దతు ఇచ్చారు. కానీ, కేంద్ర ప్రభుత్వ పథకాలను బంగాల్ రైతులకు అందకుండా అడ్డుకుంటున్నారు.
మమతా దీదీ.. మిమ్మల్ని ఓడించేందుకు దిల్లీ నుంచి ఎవరూ రావాల్సిన అవసరం లేదు. మమతా బెనర్జీ కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇందిరా గాంధీని బయట వ్యక్తిగా పిలిచారా? ఒక రాష్ట్రం ప్రజలు మరో రాష్ట్రానికి వెళ్లలేని దేశాన్ని మమత కోరుకుంటున్నారా? అటువంటి ఆలోచనలను బంగాల్ ప్రజలు అంగీకరించరు. చొరబాట్లను టీఎంసీ నిలువరించలేదు. కానీ, భాజపా ఆ పని చేసింది. "
- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి.
ఇదీ చూడండి: 'ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. బంగారు బంగాల్ నిర్మిస్తాం'