కేంద్ర హోంమంత్రి అమిత్‌షానే పశ్చిమ బంగలో ఉద్రిక్తతలకు కారణమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. జూనియర్ డాక్టర్లు చేసే సమ్మె భాజపా, సీపీఐల కుట్రగా అభివర్ణించారు.
ప్రస్తుతం భాజపా, సీపీఎంల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందన్నారు మమత. మత తత్వ రాజకీయాలను ఇరు పార్టీలు ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు.
విధుల్లో చేరని జూడాలు
విధుల్లో చేరేందుకు సీఎం మమతా బెనర్జీ విధించిన గడువు ముగిసినప్పటికీ జూనియర్ డాక్టర్లు విధుల్లో చేరలేదు. మూడో రోజు సమ్మె కొనసాగిన కారణంగా వైద్యసేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఓ రోగి మృతికి కారణమయ్యారన్న ఆరోపణలతో ఇద్దరు వైద్యులపై దాడి జరిగిన కారణంగా జూడాలు సమ్మెకు పిలుపునిచ్చారు. జూడాలకు అఖిల భారత వైద్యుల సమాఖ్య సంఘీభావం తెలిపింది. దాడికి కారణమైన వారిని అరెస్టు చేయాలని, అన్ని ఆస్పత్రుల వద్ద భద్రతను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఈ దాడి ఘటనను ఖండించారు. భాజపా బంగాల్ నేత ముకుల్ రాయ్ మమతా బెనర్జీ హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో జూడాలపై దాడిని ఖండిస్తూ నుదుట బ్యాండేజీలు ధరించి వైద్యులు విధులకు హాజరయ్యారు.
జూడాలు విధుల్లో చేరాలన్న గవర్నర్
సమ్మె వీడి విధుల్లో చేరాలని జూనియర్ డాక్టర్లకు బంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి సూచించారు. వైద్య సేవలు నిలిచిపోయి రోగులు ఇబ్బంది పడుతున్న కారణంగా విధుల్లో చేరాలన్నారు.
శాంతి నెలకొల్పేందుకు అన్ని పార్టీల అంగీకారం
బంగాల్లో శాంతికై గవర్నర్ త్రిపాఠి అఖిల పక్ష పార్టీలతో సమావేశం నిర్వహించారు. అన్ని పార్టీలు పలు అంశాలపై అంగీకారానికి వచ్చాయి. రాష్ట్రంలో శాంతి పునఃస్థాపనకై అంగీకరించాయి. కానీ శాంతి నెలకొల్పుతామని అన్ని పార్టీలు కలిసి చేసే సంయుక్త ప్రకటనకు భాజపా, తృణమూల్ కాంగ్రెస్ దూరంగా ఉన్నాయి.
గవర్నర్ ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరు కాలేదు. శాంతి భద్రతల సమస్య రాష్ట్రానికి చెందినదని, గవర్నర్‌కు దీనితో సంబంధం లేదని ఆరోపించారు మమత. భాజపాకు ప్రతినిధిగా గవర్నర్ వ్యవహరిస్తున్నారన్నారు.
42 లోక్‌సభ స్థానాలున్న బంగాల్లో 18 నియోజకవర్గాల్లో భాజపా విజయం సాధించింది. ఫలితాల అనంతరం చెలరేగిన అల్లర్లలో పలువురు భాజపా, తృణమూల్ కార్యకర్తలు మృతి చెందారు. అప్పటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమవుతూ వస్తోంది.
ఇదీ చూడండి: 'పీఎం-కిసాన్ పింఛన్' పథకం ప్రవేశపెట్టిన కేంద్రం