పౌరసత్వ సవరణ బిల్లుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధులతో వరుసగా రెండో రోజు సమావేశమయ్యారు. అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయా రాష్ట్ర ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీలు, పౌర, విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు.
గిరిజన ప్రాంతాలకు మినహాయింపు..
పౌరసత్వ సవరణ బిల్లుపై ఆందోళన వ్యక్తం చేశాయి ఈశాన్య రాష్ట్రాలు. ఈ బిల్లు వల్ల ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజనులపై ప్రభావం ఉంటుందని పలువురు.. అమిత్షా దృష్టికి తీసుకురాగా, వారు నివసించే ప్రాంతాలను బిల్లు నుంచి మినహాయిస్తామని అభయమిచ్చారు షా. త్రిపుర, మిజోరం ప్రతినిధులతో శుక్రవారమే సమావేశమయ్యారు కేంద్ర హోంమంత్రి.
శరణార్థులకు పౌరసత్వం కల్పించేలా..
బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ నుంచి వలస వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలకు భారత పౌరసత్వం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లును రూపొందించింది. అయితే ఈ బిల్లు వల్ల తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని ఈశాన్య రాష్ట్రాల్లోని వివిధ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇదీ చూడండి: బలపరీక్షలో నెగ్గిన ఉద్ధవ్ సర్కారు.. సభ నుంచి భాజపా వాకౌట్