అయోధ్య రాముడి జన్మస్థలమన్నది హిందువుల నమ్మకమని రామ్‌లల్లా తరఫు న్యాయవాది సుప్రీం కోర్టులో వాదించారు. అయితే ఆ నమ్మకం ఎంత హేతుబద్ధమైనదన్న విషయాన్ని న్యాయస్థానం పరిశీలించకూడదని నివేదించారు.
రాజకీయంగా సున్నితమైన రామ జన్మభూమి-బాబ్రీ మసీదు కేసు విచారణ సుప్రీంకోర్టులో ఆరో రోజుకు చేరుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం కేసుపై విచారణ జరుపుతోంది. రామ్‌లల్లా తరపున సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదించారు.
రాముడి జన్మస్థలం కూడా దైవంతో సమానమని... వివాదంలో ఉన్న 2.77 ఎకరాల భూమిపై ముస్లింలు తమ హక్కును నిరూపించలేరని వైద్యనాథన్ తెలిపారు. ఈ స్థలాన్ని ఏ మాత్రం విభజించినా.... విశ్వాసాన్ని దెబ్బతీసినట్లేనని సుప్రీం కోర్టుకు విన్నవించారు.
వివాదాస్పద స్థలాన్ని హిందువులు, ముస్లింలు సంయుక్తంగా కలిగి ఉన్నప్పుడు.. ముస్లింలను ఎలా బహిష్కరించాలని సుప్రీంకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో.. ఆయన ఈ మేరకు స్పందించారు.