సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నూతన పార్లమెంటు భవనం నిర్మించేందుకు వారసత్వ పరిరక్షణ(హెరిటేజ్ కన్జర్వేషన్) కమిటీ అనుమతి ఇచ్చింది. ఫలితంగా నిర్మాణ పనులు ప్రారంభించేందుకు కేంద్ర ప్రజా పనుల శాఖ(సీపీడబ్ల్యూడీ)కు మార్గం సుగమం అయింది.
సుప్రీం సూచనతో...
పార్లమెంట్ నూతన భవనంతో పాటు, కేంద్ర ప్రభుత్వ సచివాలయం నిర్మించడానికి ఉద్దేశించిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు ఈనెల 5న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టు డిజైన్‌పై కేంద్రం వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. డీడీఏ చట్టం కింద చేపట్టిన ఈ ప్రాజెక్టు చట్టబద్ధమైనదేనని, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన అనుమతులు, స్థలం కేటాయింపులు కూడా సరిగ్గానే ఉన్నాయని న్యాయస్థానం తెలిపింది. అయితే ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించే స్మాగ్ టవర్లు(చిమ్నీల్లాంటివి) ఏర్పాటు చేయాలని, యాంటీ-స్మాగ్ గన్నులను ఉపయోగించాలని ఆదేశించింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణాలకు హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ అనుమతి అవసరమని, వెంటనే ఆ అనుమతులు తెచ్చుకోవాలని సూచించింది.
అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. దీనిపై హెరిటేజ్ కమిటీ సానుకూలంగా స్పందించింది. ప్రభుత్వ ప్రతిపాదనపై చర్చించి అనుమతిపై నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ హౌసింగ్ కార్యదర్శి శంకర్ మిశ్రా తెలిపారు.
ఇదీ చదవండి: సశక్త దేశానికి ఘన ప్రతీక మన పార్లమెంట్