ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్-జేఎంఎం-ఆర్జేడీ కూటమి జయకేతనం ఎగురవేసింది. ఈ కూటమి మొత్తం 47 స్థానాల్లో గెలుపొంది సాధారణ మెజార్టీ కన్నా 5 స్థానాలు ఎక్కువ సాధించింది. ప్రతిపక్ష కూటమికి నేతృత్వం వహిస్తోన్న హేమంత్ సోరెన్ సారథ్యంలోని జేఎంఎం 30 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. గత ప్రభుత్వంపై ప్రజాగ్రహం, పౌరచట్టం, ఎన్ఆర్సీపై వ్యతిరేకత అధికార భాజపా ఆశలకు గండికొట్టడమే కాకుండా ముఖ్యమంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత రఘుబర్‌దాస్ ఓటమితో డబుల్ షాక్ తగిలింది.
ఝార్ఖండ్ శాసనసభలో మొత్తం 81స్థానాలు. జేఎంఎం 30 సీట్లలో, కాంగ్రెస్ 16, ఆర్జేడీ ఒకచోట గెలుపొందాయి. భాజపా 25, ఏజేఎస్‌యూ 2, ఇతరులు 7 చోట్ల విజయం సాధించారు. 1995 నుంచి జంషెడ్‌పుర్ తూర్పు నుంచి 5 సార్లు ప్రాతినిథ్యం వహించిన ముఖ్యమంత్రి, భాజపా సీనియర్ నేత రఘుబర్‌దాస్ ఓటమిపాలయ్యారు. రఘుబర్‌దాస్‌పై 8 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు స్వతంత్ర అభ్యర్థి సరయిరాయ్. రఘుబర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఆయనకు భాజపా టికెట్ నిరాకరించినందున తిరుగుబాటు అభ్యర్థిగా నిలిచి గెలిచారు. ఆరుగురు మంత్రులు, స్పీకర్ కూడా ఓటమిపాలయ్యారు.
బర్‌హేట్, ధుమ్‌కాలో పోటీచేసిన హేమంత్ సోరెన్ రెండుచోట్లా విజయఢంకా మోగించారు. అధికారం చేపట్టడం ఖాయమైనందున తండ్రి శిబూసోరెన్ నివాసానికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు. ఆనందంతో తండ్రి ముందు కాసేపు సైకిల్‌పై చక్కర్లు కొట్టారు.
పుంజుకున్న ప్రతిపక్షం
2014 ఎన్నికలతో పోల్చితే ప్రతిపక్ష కూటమి ఈసారి గణనీయంగా బలపడింది. గత ఎన్నికల్లో 19 స్థానాలు గెలుపొందిన జేఎంఎం ఈసారి ఆ సంఖ్యను 30కి పెంచుకుంది. గతంలో కాంగ్రెస్‌కు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉండగా ఇప్పుడు 16 మంది గెలుపొందారు. ఆర్జేడీ ఒకచోట గెలిచి ఖాతా తెరిచింది. గత ఎన్నికల్లో 37 చోట్ల గెలుపొందిన కమలం పార్టీ ఈసారి 12 స్థానాలు కోల్పోయి 25 నియోజకవర్గాలకే పరిమితమైంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ మిత్రపక్షం ఏజేఎస్యూకు 5 స్థానాలు ఉండగా.. ఇప్పుడు రెండుకు పడిపోయింది.
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిన భాజపాకు ఝార్ఖండ్ లోనూ అధికారం చేజారిపోవటం పెద్దదెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రఘుబర్‌దాస్ రాజీనామా
ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో భాజపా ఓటమి అనివార్యమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు రఘుబర్ దాస్. రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించారు.