ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, మన దేశంలోనూ 'కండలు తిరిగిన మగధీరుల (మస్కులర్) రాజకీయాలు నడుస్తున్నాయి. అందుకు భిన్నంగా నిరంకుశ మస్కులర్ బ్రిటీష్ శక్తిని 'స్త్రీత్వ' ఆరంభంతో మహాత్ముడు ఎదుర్కొన్నారు అంటారు మహిళావాద కార్యకర్త రుచిర గుప్తా.
అవును ఇది సత్యం. గాంధీజీ రూపొందించిన అహింసాయుత సత్యాగ్రహ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాతలు తల్లి పుత్లీబాయి, భార్య కస్తూర్బానే. వారి నుంచే సహాయ నిరాకరణ పాఠాలు నేర్చుకున్నానని బాపూ చెప్పుకునేవారు. దక్షిణాఫ్రికా, ఆ తర్వాత భారత స్వాతంత్ర్య పోరాటాల్లో మహిళలను సత్యాగ్రహ కార్యకర్తలుగా పెద్ద ఎత్తున తరలింపచేశారు గాంధీజీ. అంతకుముందు విజ్ఞప్తులు ఇచ్చుకునే కొద్దిమందికే పరిమితమైన కాంగ్రెస్ సంస్థను విస్తృత ప్రజాబాహుళ్య ఉద్యమంగా మార్చివేశారు మహాత్ముడు. ఈ క్రమంలోనే కనీవినీ ఎరుగని రీతిలో మహిళలు పాల్గొనేలా ఉత్తేజపరిచారు, స్ఫూర్తినిచ్చారు.
'చంపారన్'తో మహిళా శక్తి వెలుగులోకి...
మహిళలు పరదా దాటి ప్రజాజీవితంలోకి ప్రవేశించడం వల్ల రెండు ముఖ్యమైన మార్పులు వచ్చాయి. ఒకటి వారికి వారు చైతన్యమవటం, రెండోది మహిళా కార్యకర్తలతో కలిసి పనిచేయటం ద్వారా పురుషుల ధోరణి-అనన్య విధానంలో సకారాత్మక మార్పు రావటం.
ఇలా మహిళలను సమానులుగా గౌరవించటాన్ని వారు నేర్చుకున్నారు. దక్షిణాఫ్రికా ఆశ్రమాలు, ఉద్యమాల్లో మహిళలు తొలిసారిగా ఆందోళనల్లో పాల్గొనేలా స్ఫూర్తినిచ్చారు బాపూ. నాడు జరిగిన అతిపెద్ద 'గని కార్మికుల సమ్మె'కు మహిళలు స్ఫూర్తిగా నిలిచారు.
భారత్లో గాంధీజీ తొలి పోరాటం చంపారన్. ఈ రైతు పోరాటంలో మొత్తం 25 మంది వాలంటీర్లకుగానూ 12 మంది మహిళలు కావటం గమనార్హం. చంపారన్‌తో ప్రారంభమైన ఈ నూతన శకం సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం, హరిజనోద్ధరణ, క్విట్ ఇండియా.. ఇలా అన్ని ముఖ్య స్వాతంత్ర్య పోరాటాల్లో మరింతగా ప్రభవిస్తూ సాగింది.
ఎన్నికల్లో పోటీ చేసేలా మహిళలకు ప్రోత్సాహం..
1919 అహ్మదాబాద్ వస్త్ర పరిశ్రమ కార్మికుల సమ్మెకు గాంధీజీ నాయకత్వం వహిస్తే... మరో ముఖ్యనాయకురాలిగా అనసూయ శారదా భాయ్ నేతృత్వం వహించారు. 1921 సహాయ నిరాకరణ ఉద్యమంలో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. విదేశీ వస్త్ర దహనం... స్వదేశీ ఉద్యమంలో వారి పాత్ర చిరస్మరణీయం. ఏ ఉద్యమమైనా.. జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలు పాల్గొన్నప్పుడే విజయవంతం కాగలదని మహాత్మునికి తెలుసు.
అబల సబలగా మారినప్పుడే నిస్సహాయురాలు కూడా ఎంతో శక్తిమంతులవుతారనేవారు. స్వదేశీ ఉద్యమానికి ముఖ్యమైన రాట్నం వడకటం, నూలు వస్త్రాల తయారీ పనుల్లో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాలుపంచుకొన్నారు. రాట్నం వడకటం వల్ల ఆర్థికంగానూ మహిళలు స్వతంత్రులు కాగలరు అనేవారు బాపు. 1925లో సరోజినీ నాయుడును కాంగ్రెస్ తొలి భారత మహిళా అధ్యక్షురాలిగా చేయటంలో గాంధీ పాత్ర ఎంతో ఉంది. అప్పటివరకు బ్రిటీష్ లేబర్ పార్టీ, అమెరికన్ డెమొక్రటిక్ పార్టీ వంటి ప్రగతిశీల సంస్థలకు మహిళలు నాయకులు కాలేకపోయారు. ఇది గమనించదగిన అంశం.
అంతకు ముందు 1919 చట్టంలో భారతీయులు ఎన్నికల్లో పోటీ చేయడం ప్రారంభం కాగా.. ఈ ప్రక్రియలో మహిళలు పాలుపంచుకునేలా ప్రోత్సహించారు మహాత్ముడు. గాంధీజీ స్ఫూర్తితో 1931లో మహిళలకు చదువు, హోదాతో నిమిత్తం లేకుండా సమానహక్కులు కోరుతూ కాంగ్రెస్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
ఒంటిపై ఆభరణాలు విరాళంగా...
స్వాతంత్ర్యం, సామాజిక ఉద్యమాల్ని కలగలిపి రెండింటికీ సమప్రాధాన్యం ఇచ్చే మహాత్ముడు 1933లో హరిజన అభివృద్ధి యాత్ర పెట్టుకున్నారు. అంటరానివారుగా పరిగణించే దళితుల సమానహక్కుల కోసం, సమాజాన్ని చైతన్యపరచడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. దేశవ్యాప్తంగా ఈ యాత్రకు మహిళలు సైతం మద్దతుగా నిలిచారు. ఆంధ్రాతో సహా గాంధీ పర్యటించిన అనేక ప్రాంతాల మహిళలు హరిజన నిధికి తమ ఒంటిపై ధరించిన బంగారు ఆభరణాలను విరాళంగా సమర్పించారు.
దండి సత్యాగ్రహంలో దేశవ్యాప్తంగా వేలాది మంది మహిళలు పాలుపంచుకున్నారు. అరెస్టయ్యారు. సబర్మతి నుంచి 37 మంది మహిళా కార్యకర్తలతో బయలుదేరి కస్తూర్బా గాంధీ.. ఉప్పు తయారుచేసి శాసనోల్లంఘన చేశారు. సరోజినీ నాయుడు, కమలాదేవి ఛటోపాధ్యాయ తదితరులు ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించారు. ఖిలాఫత్, సహాయనిరాకరణ ఉద్యమాల్లో ముస్లిం మహిళలు కూడా పాలుపంచుకున్నారు. ముస్లిం మహిళలు గాంధీజీ వద్ద పరదా పద్ధతి పాటించేవారు కాదు. బాపూపై ఉన్న నమ్మకం, గౌరవానికి ఇది ప్రతీకగా నిలిచింది.
అరుణా అసఫ్, ఉషా మెహతా..
1942లో మహాత్ముడు 'క్విట్ ఇండియా' అని నినదించారు. ఈ ఉద్యమంపై బ్రిటీష్ ప్రభుత్వం విరుచుకుపడింది. అయినప్పటికీ మహిళలు వెన్నుచూపలేదు. అరుణా అసఫ్ అలీ ఈ పోరాటంలో చురుకైన పాత్ర పోషించారు. ఉషా మెహతా రహస్య రేడియో నడిపారు.
ఉద్యమాల్లోనే కాకుండా ఆ తర్వాత మంత్రులు, గవర్నర్లుగా కూడా మహిళలు నియమితులయ్యారు. రాజ్యాంగ రచన పరిషత్‌లో మహిళా సభ్యులున్నారు. మన రాజ్యాంగం మహిళలకు ఓటు హక్కు ఇచ్చింది. ఆనాటికి అభివృద్ధి చెందిన ఎన్నో స్వాతంత్ర్య దేశాల్లో మహిళలకు ఓటు హక్కు నిషిద్ధం. భారత స్వాతంత్ర్యోద్యమంలో మహాత్ముని ద్వారా ఉత్తేజితులై పెద్దసంఖ్యలో మహిళలు పాలుపంచుకోవటమే కాకుండా, ఏళ్ల తరబడి జైలుశిక్షలు అనుభవించారు.
బాపూపై మహిళల అభిమానం....
గాంధీజీ ప్రభావం ఆనాటి మహిళా సమాజానికి సరికొత్త శక్తినిచ్చింది. మహిళలు ఉద్యమంలో భాగస్వాములు కావటం వల్ల మగవారి వద్ద వారి గౌరవం పెరిగింది. జాతీయోద్యమ నాయకత్వానికి, సంఘంలో మహిళల సమస్యలు, హక్కుల పట్ల చైతన్యం పెరిగింది.
'అంటరానితనం, మహిళలపట్ల వివక్ష రెండూ భారత సమాజాన్ని పట్టిపీడిస్తున్న జాడ్యాలు' అంటారు గాంధీజీ.
'మగవాడు చదువుకుంటే ఒక్కడికే చదువు అబ్బుతుంది. మహిళను చదివిస్తే మొత్తం కుటుంబాన్ని, సమాజాన్ని చదివించినట్లే. మహిళా సాధికారత ద్వారానే దోపిడీ రహిత సమాజం సాకారమవుతుంది' అనేవారు.
బాపూ ధైర్యసాహసాలే స్ఫూర్తిగా...
స్వరాజ్య ఉద్యమం... కుల, మత, లింగ విభేదాలకు తూట్లు పొడిచింది. దళిత మహిళల చేతి వంటను సత్యాగ్రహులు భుజించేవారు. గాంధీజీ వల్ల మహిళలు చైతన్యమవటమే కాదు ఉద్యమకారిణుల ద్వారా బాపు కూడా స్వతంత్ర భావాలను అభివృద్ధి పర్చుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే పలుమార్లు చెప్పుకున్నారు. మహిళలు బాపూను విపరీతంగా అభిమానించేవారు. నౌకాళీ మత కల్లోల ప్రాంతంలోని ఒక గ్రామానికి శాంతిదూతగా అందరూ వద్దని వారిస్తున్నా బాపూ అభాగాంధీని పంపారు. దేశ విభజన అల్లర్ల కాలంలో అపహరణకు గురైన ఒక బాలికను రక్షించేందుకు మృదులా సారాభాయ్ కార్యరంగంలోకి దూకారు. బాపూ నుంచే ఈ ధైర్యసాహసాలను నేర్చుకున్నానని చెప్పుకున్నారు.
భారత జాతీయోద్యమంలోనే అధికం..
పలువురు చరిత్రకారులు చెప్పినట్లు రష్యా, చైనా విప్లవాల్లో కంటే భారత జాతీయోద్యమంలోనే అత్యధిక సంఖ్యలో మహిళలు పాలుపంచుకున్నారు. ఇందుకు స్ఫూర్తి, ప్రేరణ, మార్గదర్శి గాంధీజీనే. ఆశ్రమంలో ఉన్న వారికి ఏదైనా జబ్బు చేస్తే మహాత్ముడు స్వయంగా సేవ చేసేవారు. 'బాపూజీ నా తల్లి (బాపూ మై మదర్)' అంటూ దగ్గరి బందువు మనూ గాంధీ ఒక పుస్తకాన్ని రాశారు. మొత్తంగా జాతీయోద్యమంలో మహిళా చైతన్యానికి మహాత్ముని కృషి ఎనలేనిది.
(రచయిత- బి. భాస్కర్, సీనియర్ పాత్రికేయుడు)