కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తాను నిరాహార దీక్ష చేపడతానని సామాజిక కార్యకర్త అన్నా హజారే పునరుద్ఘాటించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఇది తన జీవితంలో చివరి నిరాహార దీక్ష అని లేఖలో పేర్కొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. దిల్లీలోని రామ్లీలా మైదానంలో జనవరి చివరివారంలో దీక్ష ఉంటుందన్నారు.
కేంద్రం పట్టించుకోలేదు..
డిసెంబర్ 14 కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమార్కు లేఖ రాశానన్నారు. రైతుల డిమాండ్లు నెరవేర్చకపోయినా, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలుచేయకపోయినా నిరాహార దీక్ష చేపడతానని ఇది వరకే తాను లేఖలో తెలిపినట్లు మీడియాకు వివరించారు అన్నా హజారే. అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్ కమిషన్కు స్వయంప్రతిపత్తి కల్పించాలని.. తాను లేఖలో డిమాండ్ చేసినట్లు తెలిపారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
దిల్లీ రామ్లీలా మైదానంలో నిరాహార దీక్ష అనుమతికోసం అధికారులకు ఇప్పటికే నాలుగు లేఖలు రాశానన్నారు. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. 2011లో తాను అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించినప్పుడు తనను ప్రశంసించిన భాజపా మంత్రులు..ప్రస్తుతం తన డిమాండ్లను పట్టించుకోవటం లేదన్నారు.
రైతు చట్టాలకు సుప్రీంకోర్టు స్టే ఇచ్చినందువల్ల కేంద్రం నైతికంగా ఓడిపోయిందన్నారు. రైతులు శాంతియుతంగా ఉద్యమాన్ని కొనసాగించినంత వరకూ కేంద్ర ప్రభుత్వం వారిని ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమస్యకు పరిష్కారం లభించేలా లేదని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి : నేడు రైతు సంఘాలతో కేంద్రం 9వ విడత చర్చలు