వంట గ్యాస్ ధరలను భారీగా పెంచడాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి విపక్షాలు. ప్రజల జేబులకు భాజపా కరెంట్ షాక్ ఇచ్చిందని కాంగ్రెస్ విమర్శించింది.
"ఒక్కో ఎల్పీజీ సిలిండర్‌పై మోదీ ప్రభుత్వం రూ.144 పెంచింది. 2019-20 మధ్య కాలంలో మొత్తం రూ.200 పెంచింది. విద్యుత్ గురించి మాట్లాడుతూ.. ప్రజల జేబులకు షాకిచ్చింది."
- రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
ఇటీవల జరిగిన దిల్లీ శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా షాహీన్‌బాగ్ ఆందోళనను ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. నిరసనకారులకు కరెంట్ షాక్ ఇవ్వాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని రణ్‌దీప్ పైవిధంగా స్పందించారు.
క్రూరమైన చర్య: మాయావతి
గ్యాస్ ధరల పెంపును క్రూరమైన చర్యగా అభివర్ణించారు బీఎస్పీ అధినేత్రి మాయావతి.
"ఇప్పటికే ద్రవ్యోల్బణంతో బాధపడుతున్న కోట్ల మంది పేద ప్రజలపై మరింత భారం పడుతుంది. ఇది అత్యంత క్రూరమైన నిర్ణయం. రాజ్యాంగం సూచించిన విధంగా సంక్షేమం దిశగా కేంద్రం పనిచేస్తే బాగుండేది."
- మాయావతి, బీఎస్పీ అధినేత్రి
ధర పెంపు- రాయితీ రెట్టింపు
అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. ప్రజలపై ఒక్కో సిలిండర్‌కు రూ.144.5(దిల్లీలో) మేర భారం పడనుంది. తాజా ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.
అయితే పెంచిన ధరల నుంచి బదులుగా సిలిండర్‌పై ఇచ్చే రాయితీని రెట్టింపు చేసింది ప్రభుత్వం. ఒక్కో సిలిండర్‌పై వచ్చే రాయితీ రూ.153.86 నుంచి రూ.291.48కి పెంచింది.
ఇదీ చూడండి: వంట గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు... కానీ...