ఎప్పుడైనా టోల్గేట్ దగ్గర ఏం చేస్తాం? మన వాహనాన్ని బట్టి రుసుము కట్టి వెళ్లిపోతాం. కానీ ఓ కారు డ్రైవర్ టోల్ రుసుము కట్టకపోగా... అక్కడున్న ఉద్యోగిని కారుపైనే లాక్కెళ్లాడు. హరియాణా గురుగ్రామ్‌లో జరిగిన ఈ ఘటన అందరినీ నివ్వెరపరిచింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. అశోక్ కుమార్ అనే ఉద్యోగి ఖేర్కి డౌలా టోల్ గేట్ వద్ద రుసుము కోసం ఓ ఇన్నోవా కారును ఆపేందుకు ప్రయత్నించాడు.
కానీ... కారులోని డ్రైవర్ అతడ్ని పట్టించుకోకుండా అశోక్ కుమార్‌ను వేగంగా ఢీ కొట్టాడు. ఆ ఉద్యోగి కారుపైనే పడిపోయాడు. డ్రైవర్ అలాగే దాదాపు 8 కిలోమీటర్లు కారును వేగంగా నడిపాడు. అనంతరం మనేసర్ ప్రాంతంలో కారు ఆపి అశోక్ కుమార్‌పై దాడికి యత్నించారు కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు. ఈ విషయాన్ని పోలీసులకు చెబితే ప్రాణాలు తీస్తామని బెదిరించారు. ఈ మొత్తం తతంగం సీసీ కెమెరాల్లో రికార్డయింది. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: 'మోదీ డూప్'కు ఎన్నికల సంఘం నోటీసులు