నిర్భయ దోషులు నలుగురికి ఉరి శిక్ష అమలు చేసేందుకు దిల్లీ తిహార్ జైలు సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తర్ప్రదేశ్ మేరఠ్ నుంచి వచ్చిన తలారి పవన్.. ఇవాళ డమ్మీలతో ట్రయల్స్ కూడా నిర్వహించాడు.
నిర్భయ కేసులో దోషులుగా ఉన్న ముకేశ్ కుమార్ సింగ్, అక్షయ్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మను మార్చి 20న ఉదయం 5:30 గంటలకు ఉరి తీయనున్నారు.
పిటిషన్ కొట్టివేత
నిర్భయ అత్యాచారం జరిగిన సమయంలో తాను దిల్లీలోనే లేనని, అందువల్ల మరణశిక్ష రద్దు చేయాలని దోషి ముకేశ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ను దిల్లీ కోర్టు మంగళవారం కొట్టివేసింది.
ఇదే కేసులో మిగిలిన ముగ్గురు దోషులు అక్షయ్ కుమార్, వినయ్, పవన్ గుప్తా...అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దిల్లీ కోర్టు తమకు విధించిన మరణ శిక్షపై స్టే విధించాలని ఐసీజేను కోరారు.
ఘోరం
2012 డిసెంబర్ 16న దిల్లీ సామూహిక అత్యాచారం జరిగింది. కదిలే బస్సులో 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిపై నలుగురు మృగాళ్లు కలిసి సామూహిక అత్యాచారం చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు సింగపూర్ ఆసుపత్రిలో తనువు చాలించింది.
ఇదీ చూడండి: కరోనా: మాస్క్ ఎవరు పెట్టుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?