మానవ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే ఔషధాలపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది ప్రముఖ ఆరోగ్య సంస్థ హామ్దర్ద్ ల్యాబొరేటరీస్. ఈ మేరకు ప్రభుత్వ అనుమతి కోసం సంబంధిత అధికారిక వర్గాలకు తమ ప్రతిపాదనను పంపినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. దిల్లీలోని 'హామ్దర్ద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్'లో ఈ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.
హామ్దర్ద్ సంస్థ ప్రతిపాదనను ఆయుష్ శాఖ టాస్క్ఫోర్స్ సిబ్బంది పరిశీలించిన అనంతరం.. క్లినికల్ ట్రయల్స్ అనుమతిపై ఐసీఎంఆర్ తుది నిర్ణయం తీసుకోనుంది. కరోనా వ్యాప్తిని అరికట్టేలా పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు ముందడుగేయాలన్న ఆయుష్ మంత్రిత్వశాఖ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు హామ్దర్ద్ ల్యాబొరేటరీస్ ఛైర్మన్ అబ్దుల్ మజీద్ తెలిపారు.
'ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాపై పోరాడేందుకు బలమైన రోగనిరోధక శక్తే కీలకం. మా ఔషధాలు సహజంగా రోగ నిరోధక శక్తిని పెంచేలా అభివృద్ధి చేశాం. ఇవి నిర్ధిష్ట ప్రతిరోధకాలను అభివృద్ధి చేయడం ద్వారా కొవిడ్-19 ప్రభావాన్ని తగ్గించడంలో సాయపడతాయి.'
- అబ్దుల్ మజీద్, హామ్దర్ద్ ల్యాబొరేటరీస్ ఛైర్మన్
మహమ్మారిపై పోరాటంలో భాగంగా తమ సంస్థ నిర్వహించే ట్రయల్స్ సానుకూల ఫలితాలను ఇస్తాయని హామ్దర్ద్ ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి: 'మరణాల రేటు అత్యల్పం- రికవరీ రేటు గణనీయం'