గుజరాత్లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలపై నిరసనలు కొనసాగుతున్నాయి. గురువారం వందలాది మంది నిరుద్యోగులు రాష్ట్ర రాజధాని గాంధీనగర్ వీధుల్లో ఆందోళనలు చేపట్టారు. ఇటీవలె నిర్వహించిన నియామకాల పరీక్షను ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ విషయంపై ప్రభుత్వం స్పందిస్తూ వెంటనే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపింది. కష్టపడిన ప్రతి అభ్యర్థికి న్యాయం జరిగేలా చేస్తామని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపానీ హామీ ఇచ్చారు.
పరీక్షల్లో మాస్ కాపీ, పేపర్ లీక్ వంటి ఆరోపణలపై మా ప్రభుత్వం విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటుంది. తప్పు చేసినవారు కచ్చితంగా ఉద్యోగాలకు అనర్హులు. వారికి ఉద్యోగాలు రాకుండా చూస్తాము. కష్టపడిన ప్రతిఒక్కరికీ తప్పకుండా న్యాయం జరిగేలా చేస్తాము.
-విజయ్ రుపానీ, గుజరాత్ ముఖ్యమంత్రి
నియామక పరీక్ష రద్దుపై మాత్రం ముఖ్యమంత్రి నుంచి ఎటువంటి స్పష్టత రాలేదు.
సమస్యను మరో రెండు రోజుల్లో పరిష్కరిస్తామని రాష్ట్ర హోంమంత్రి ప్రదీప్సింగ్ జడేజా పేర్కొన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు జడేజా.
నవంబరు 14న గుజరాత్ సబ్ ఆర్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు(జీఎస్ఎస్ఎస్బీ) ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించింది. పరీక్షా సమయంలో అవకతవకలు జరిగాయని, వెంటనే ఈ నియామకాలను రద్దు చేయాలని బుధవారం విద్యార్థులు నిరసన బాట పట్టారు.
ఇదీ చూడండి: శబరిమలపై 2018 తీర్పు అంతిమం కాదు: సుప్రీంకోర్టు