ఆన్లైన్ పోకర్ గేమ్... గుజరాత్లో ఓ ఐటీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడేందుకు కారణమైంది. ఈ ఘటన రాజ్‌కోట్ జిల్లా మోటా మార్వా ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగింది. మరుసటి రోజు ఉదయం నీటిలో మృతదేహం తేలగా విషయం వెలుగులోకి వచ్చింది.
మృతుడు కృనాల్ మెహతా(39) ఆత్మహత్యకు పాల్పడడానికి కారణాలు ఆరా తీస్తే... నివ్వెరపరిచే సంగతి తెలిసింది. కృనాల్‌కు ఆన్లైన్ పోకర్ గేమ్ ఆడటం అలవాటైంది. ఇందుకు అవసరమైన డబ్బును స్నేహితులు, బంధువులు దగ్గర అప్పు చేసేవాడు. ఇలా మొత్తంగా రూ.78లక్షలు పోగొట్టుకున్నాడు. చివరకు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
"కృనాల్ ఇంటి నుంచి ఓ లేఖ స్వాధీనం చేసుకున్నాం. 'పోకర్‌బాజీ' ఆడేందుకు మిత్రులు, బంధువుల నుంచి రూ.78లక్షలు అప్పు చేసినట్లు ఆ లేఖలో కృనాల్ పేర్కొన్నాడు.
మొబైల్ గేమింగ్ యాప్‌లో కృనాల్ తన బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాడు. అతడి మృతి తర్వాత కృనాల్ సోదరుడికి బ్యాంకు లావాదేవీ వివరాలతో ఒక మెయిల్ వచ్చింది. వరుస గేముల్లో కృనాల్ ఎంతెంత సొమ్ము పోగొట్టుకున్నాడో అందులో ఉంది."-విక్రమ్ వంజారా, పోలీస్ అధికారి
కృనాల్ ఆత్మహత్యపై సైబర్ సెల్ పోలీసులూ దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి : అనాథల కథ: భర్తకు తలకొరివి పెట్టిన భార్య