చైనా దురాక్రమణ వైఖరిని గమనించిన వివిధ దేశాలు భారత్‌కు బాసటగా నిలుస్తున్నాయి. డ్రాగన్ కుట్రలను పసిగట్టి మన దేశ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తున్నాయి. చైనా దుర్బుద్ధిని ఎండగడుతున్నాయి. భారత సరిహద్దుల్లో డ్రాగన్ దుశ్చర్యల్ని ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ ఖండించాయి. తాజాగా ఈ జాబితాలో జపాన్ కూడా చేరింది. సరిహద్దు విషయంలో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా చేస్తున్న ఏకపక్ష చర్యలపై వివిధ దేశాలు ఎలా స్పందించాయో చూద్దాం..
సరిహద్దులు మార్చే ప్రయత్నాలను వ్యతిరేకిస్తాం: జపాన్
"ఏకపక్షంగా సరిహద్దులను మార్చే ఎలాంటి ప్రయత్నాలనైనా తాము వ్యతిరేకిస్తాం. చర్చల ద్వారా సమస్య శాంతియుతంగా పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాం" అని జపాన్ రాయబారి సతోషి సుజుకీ భారత విదేశాంగ ప్రతినిధి హర్షన్‌వర్ధన్ ష్రింగ్లాతో భేటీ తర్వాత అన్నారు.
రఫేల్ యుద్ధవిమానాలను వీలైనంత త్వరగా అందిస్తాం: ఫ్రాన్స్
" భారత సైనికులు, వారి కుటుంబాలకు చాలా పెద్ద నష్టం జరిగింది. ఇలాంటి కష్ట సమయంలో మా దేశ ప్రజలు, సైన్యం తరుఫున స్థిరమైన, స్నేహ పూర్వక మద్దతు తెలుపుతున్నాం" అని గల్వాన్ ఘటనను ఉద్దేశిస్తూ ఫ్రాన్స్ ప్రకటన జారీ చేసింది. అలాగే.. చైనా కుట్రలను పసిగట్టి భారత్‌కు రఫేల్ యుద్ధ విమానాలను వీలైనంత తొందరగా అందించేందుకు సిద్ధమైంది.
ఇది చైనా దుందుడుకు వైఖరికి నిదర్శనం: అమెరికా
"భారత్, చైనా సరిహద్దులో చైనా దురాక్రమణ తీరు, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఆ దేశ దుందుడుకు వైఖరికి సరిగ్గా సరిపోతుంది. ఈ చర్యలన్నీ చైనా కమ్యూనిస్టు పార్టీ నిజ స్వరూపాన్ని బయటపెడుతున్నాయి" అని ట్రంప్ అన్నారు. అలాగే ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదాలను నిశితంగా పరిశీలిస్తున్నామన్న ఆయన సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని హితవు పలికారు. మరోవైపు చైనా విస్తరణకాంక్షను అగ్రరాజ్యానికి చెందిన పలువురు కీలక చట్టసభ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. అలాగే భారత్ సహా ఆసియా దేశాలకు చైనా సైన్యం నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు తమ అంతర్జాతీయ బలగాలను తరలించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వెల్లడించారు. దీంతో పాటు ఇటీవల చైనా యాప్‌లను నిషేధిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా అమెరికా స్వాగతించింది.
ఘర్షణ పరిష్కారం కాదు: బ్రిటన్
"ఘర్షణ ద్వారా ఎలాంటి సమస్యకు పరిష్కారం లభించదు. ఇరు దేశాలు చర్చల ద్వారా సామరస్యకపూర్వక వాతావరణంలో సరిహద్దు వివాదాల్ని పరిష్కరించుకోవాలి" అని చెబుతూ చైనా దురుసు వైఖరిని బ్రిటన్ విమర్శించింది. హాంకాంగ్‌ను హస్తగతం చేసుకునే దిశగా చైనా చేస్తున్న కుట్రలపై కూడా ఈ సందర్భంగా స్పందించింది. పరోక్షంగా చైనా దురాక్రమణ వైఖరిని బ్రిటన్ తప్పుబట్టింది.
ఇదీ చూడండి: కరోనా సోకిందా? అయితే ఈ నగదు బహుమానం మీకే!