కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ అరెస్ట్‌ను ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితులు అలుముకుంటున్న తరుణంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేంద్ర ప్రభుత్వం... తమ నేతలను అరెస్టు చేయిస్తోందని ఆరోపించింది. శివకుమార్ అరెస్ట్‌పై న్యాయపోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది హస్తం పార్టీ.
గతేడాది సెప్టెంబరులో మనీ లాండరింగ్ ఆరోపణలపై శివకుమార్ సహా దిల్లీలోని కర్ణాటక భవన్ అధికారి హనుమంతప్పపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో దిల్లీలో నాలుగుసార్లు ప్రశ్నించిన అనంతరం ఆయనను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు అధికారులు. తాను ఎలాంటి తప్పు చేయలేదంటున్న శివకుమార్...గుజరాత్ రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కీలకంగా వ్యవహరించినందుకే కేంద్రం తనపై ఈడీ, ఐటీ సంస్థలను ప్రయోగిస్తోందని ఆరోపించారు.
కాంగ్రెస్ ట్రబుల్ షూటర్‌గా పేరొందిన శివకుమార్‌కు కర్ణాటకలోని విపక్ష నేతలు మద్దతుగా నిలిచారు. శివకుమార్ అరెస్ట్‌ను ఖండించిన నేతలు.. కేంద్ర సంస్థలను ఉపయోగించి భావవ్యక్తీకరణ స్వేచ్ఛను భాజపా హరింపజేస్తోందని ఆరోపించారు.
"తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేంద్రం ఇలాంటి చర్యలు చేపడుతోంది. భాజపా ప్రతీకార రాజకీయాల్లో శివకుమార్ కుడా ఓ బాధితుడు. శివకుమార్ కచ్చితంగా నిర్ధోషిగా బయటకు వస్తారు. భాజపా చేస్తున్న కుట్రలు ప్రజలకు అర్థమవుతాయి."
--- సిద్ధరామయ్య, సీనియర్ కాంగ్రెస్ నేత.
"వినాయక చవితి రోజునా శివకుమార్‌కు ఈడీ విరామం ఇవ్వలేదు. తమకు వ్యతిరేకమని భావిస్తున్న నేతలను అణచివేయడానికి కేంద్ర సంస్థలను భాజపా వినియోగిస్తోంది."
--- కుమారస్వామి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి.
శివకుమార్ అరెస్ట్‌ను కర్ణాటక కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ సభ్యులు ఖండించారు. కాంగ్రెస్ సీనియర్ నేత అరెస్ట్‌కు వ్యతిరేకంగా బుధవారం నిరసనలు చేపట్టనున్నట్టు ప్రకటించారు.
మరోవైపు మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన డీకే శివకుమార్‌ను బుధవారం కోర్టులో హజరుపరిచి కస్టడీ కోరనుంది ఈడీ.