2022లో జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాలను కొత్తగా అభివృద్ధి చేసిన పార్లమెంటు భవనంలో నిర్వహిస్తామని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. వేర్వేరు శాఖలకు చెందిన భవనాలకు సంబంధించిన ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభమవుతుందని పేర్కొన్నాయి. రాష్ట్రపతి భవన్, ఉత్తర, దక్షిణ బ్లాక్‌ల నుంచి ఇండియా గేట్ వరకు సాగే 3 కిలోమీటర్ల రోడ్డును సెంట్రల్ విస్తా పేరిట అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే వీటన్నింటికీ సంబంధించి సెప్టెంబర్ 2న అంతర్జాతీయంగా ఆర్కిటెక్ట్ సంస్థలకు పిలుపునిచ్చినట్లు తెలిపాయి.
కొత్తగా నిర్మించబోయే ఐకానిక్ భవనాలు 150 నుంచి 200 ఏళ్ల పాటు ఉపయోగంలో ఉండేలా నిర్మాణం జరగనున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవనం 1927లో పూర్తికాగా.. ప్రస్తుత అవసరాలకు అది సరిపోవడం లేదని కేంద్ర గృహ నిర్మాణ శాఖ పేర్కొంది.
2022 ఆగస్టు 15న 75వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి కొత్త పార్లమెంటు భవనాలు సిద్ధం అవుతాయని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.
మ్యూజియంగా పాత భవనం..!
ఒక వేళ కొత్త పార్లమెంటు భవనం నిర్మిస్తే.. పాత చారిత్రక భవంతి మ్యూజియంగా మారే అవకాశాలున్నాయని అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఉత్తర, దక్షిణ బ్లాక్‌ల డిజైన్లలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశాయి.
ఇదీ చూడండి: 'ఎన్ఆర్సీ పేరుతో నిప్పుతో చెలగాటమాడొద్దు'