భారత్- చైనా సైన్యాల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో వాస్తవాధీనరేఖ వెంబడి జరుగుతున్న 32 రోడ్డు పనులను వేగవంతం చేయాలని నిర్ణయించింది కేంద్రం. హోంశాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రజాపనుల విభాగం, సరిహద్దు రహదారి సంస్థ, ఐటీబీపీ అధికారులు సహా ఇతరులు పాల్గొన్న ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం భారత్- చైనా సరిహద్దుల్లో మొత్తం 73 రహదారి పనులు జరుగుతుండగా.. వాటిలో కేంద్ర ప్రజా పనుల విభాగం 12, సరిహద్దు రోడ్డు విభాగం 61 రోడ్డు పనులను.. చేపట్టాయి. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ కేంద్ర హోంశాఖ తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
సరిహద్దు రోడ్డు విభాగం చేస్తున్న 61 రహదారి పనుల్లో 3 చాలా ముఖ్యమైనవిగా అధికారవర్గాలు తెలిపాయి. రోడ్డు పనులతోపాటు విద్యుత్తు, ఆరోగ్యం, టెలికం, విద్య వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో భారత్- చైనా సరిహద్దు ప్రాంతాల్లో రోడ్డు పనులకు బడ్జెట్ పెంచటం వల్ల పనుల వేగం పెరిగినట్లు కేంద్ర హోంశాఖవర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి: చైనా సైన్యంపై గెలుపు సులువే- ఇవే కారణాలు...