క్రీడా రంగంలో డోపింగ్‌ను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డోపింగ్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఓ జాతీయ వేదికను ఏర్పాటు చేయనుంది. "నేషనల్ కంప్లయెన్స్ ప్లాట్‌ఫారమ్ అగైనస్ట్ డోపింగ్ ఇన్ స్పోర్ట్" పేరుతో ఈ వేదికను ఏర్పాటు చేయనుంది. దీనికి క్రీడాశాఖ కార్యదర్శి నేతృత్వం వహించనున్నారు. యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ ఆమోదించిన అంతర్జాతీయ తీర్మానానికి ఈ వేదిక కట్టుబడి ఉంటుంది.
భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు, నేషనల్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ డైరక్టర్ జరనల్(ఎన్ఏడీఏ డీజీ).. ఇందులో సభ్యులుగా వ్యవహరించనున్నారు. మొత్తం పది మంది సభ్యులు ఉండే ఈ ప్యానెల్లో హోం, విదేశాంగ, ఆర్థిక, మానవ వనరులు, ఆరోగ్య, న్యాయశాఖకు చెందిన ప్రతినిధులు ఉండనున్నారు.
2005లో 33వ యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్‌లో క్రీడల్లో డోపింగ్‌పై పోరుకు సభ్య దేశాలు ఓ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఆ సభ్య దేశాల్లో భారత్ కూడా ఉంది.